
‘నేనిప్పుడు గర్భవతిని.. అవన్నీ రూమర్లే..’
తానిప్పుడు గర్భవతిని అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోళి చెప్పింది.
ముంబయి: తన సోదరికి తనకు ఎలాంటి వివాదం లేదని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలి స్పష్టం చేసింది. కంగనాకు తన సొంత అక్కాచెల్లెళ్లతోనే పడటం లేదని, వారి మధ్య విభేదాలున్నాయంటూ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆమె స్పష్టత నిచ్చింది. తనను తన సోదరి కంగనా ఎప్పుడూ పక్కనే ఉంచుకుంటుందని, ప్రస్తుతం తాను గర్భవతిని అవడం వల్లే కనిపించడం లేదని తెలిపింది.
తమ మధ్య ప్రేమకు అసలు అంతమే లేదని చెప్పింది. ‘నటిగా నా సోదరి కంగన కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుంచి నేను ఆమె పక్కనే ఉంటున్నాను. ఆమె మాకు అండగా ఉండటం మాత్రమే కాదు.. జీవితాన్నిచ్చింది. ప్రస్తుతం నేను గర్భవతిని కావడం వల్లే పని నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాను. అంతేగానీ, మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు’ అని రంగోళి తెలిపింది. కంగనా వర్క్ షెడ్యూల్ మొత్తం కూడా రంగోళి దగ్గరుండి చూసుకునేది. ఇటీవల ఆమె కనిపించకపోవడంతో వారి మధ్య విబేధాలు వచ్చాయని వార్తలు గుప్పుమన్నాయి.