
షోలో చందన్‌శెట్టి, నివేదిత
కర్ణాటక ,మైసూరు : దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన యువ దసరా వేదికపై తన ప్రేమను వ్యక్తపరచినందుకు సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో బిగ్‌బాస్ విజేత, గాయకుడు చందన్ శెట్టి క్షమాపణలు కోరారు. నగరంలోని మహరాజ కాలేజీ మైదానంలో నిర్వహించిన యువ దసరా వేదికపై గత సీజన్ బిగ్‌బాస్ విజేత చందన్‌శెట్టి అదే షోలో పాల్గొన్న నివేదిత గౌడకు ప్రేమను వ్యక్తపరచి నిశ్చితార్థం ఉంగరాన్ని బహుకరించాడు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజలతో పాటు నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహావేశాలు, విమర్శలు వ్యక్తం చేశారు. దీంతో చందన్‌శెట్టి శనివారం మీడియా ఎదుట క్షమాపణలు చెప్పాడు. నివేదితకు ప్రేమ వ్యక్తపరచడం వ్యక్తిగత నిర్ణయమని అయితే బహిరంగ వేదికపై అలా ప్రేమను వ్యక్తపరచడం తప్పేనని అంగీకరించాడు. కాగా ఈ ఘటనపై మంత్రి సోమణ్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి దసరా ఉత్సవ సమితి చందన్‌శెట్టికి నోటీసులు జారీ చేయడానికి నిర్ణయించుకుంది.