
చెన్నై : నటుడు కార్తీ, నటి జ్యోతిక కలిసి నటిస్తున్న తొలి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. నటుడు కార్తీ హీరోగా నటించిన దేవ్ చిత్రం ఆయనకు నిరాశనే మిగిల్చింది. ఆ తరువాత లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించిన ఖైదీ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా ఖైదీ చిత్రాన్ని పూర్తి చేసిన కార్తీ ప్రస్తుతం తన వదిన జ్యోతికతో కలిసి ఒక చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి పాపనాశం చిత్రం ఫేమ్ జీతూ జోసఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఇందులో నటుడు సత్యరాజ్, రాక్షసన్ చిత్రం ఫేమ్ అమ్ము అభిరామి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర ఛాయాగ్రహకుడు ఆర్‌డీ.రాజశేఖర్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 96 చిత్రం ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వూకాం 18 సంస్థ, పారలెల్ మైండ్ సంస్థ కలిసి నిర్మిస్తున్నారు. నిర్మాణంలోనే మంచి అంచనాలు నెలకొన్న ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిసింది. కాగా దీన్ని అక్టోబరు నెలలో తెరపైకి తీసుకు రావడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన రాక్షసి చిత్రం ఈ నెల 5వ తేదీన విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోందన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment