ఆరంభమే ముద్దులతో.. | Nikhila Vimal in Karthi Donga Movie | Sakshi
Sakshi News home page

ఆరంభమే ముద్దులతో..

Published Sat, Dec 14 2019 11:04 AM | Last Updated on Sat, Dec 14 2019 11:04 AM

Nikhila Vimal in Karthi Donga Movie - Sakshi

నటి నికిలావిమల్‌

సినిమా: కార్తీతో ఆరంభంలోనే ముద్దు సన్నివేశంలో నటించానని నటి నికిలా విమల్‌ చెప్పుకొచ్చింది. ఈ మలయాళీ కుట్టి ఇంతకు ముందు కిడారి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తరువాత తంబి చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కార్తీ, నటి జ్యోతిక అక్కా, తమ్ముడుగా నటిస్తున్న చిత్రం తంబి. నటుడు సూర్య తన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జీతు జోసఫ్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 20వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. తంబి చిత్రంలో నటుడు కార్తీతో నటించిన అనుభవం గురించి నటి నికిల విమల్‌ పేర్కొంటూ జీతూజోసప్‌ దర్శకత్వంలో ఇంతకు ముందే ఒక మలమాళ చిత్రంలో నటించాల్సిందని, కాల్‌షీట్స్‌ సమస్య కారణంగా నటించలేకపోయినట్లు చెప్పింది. అప్పుడు మరో చిత్రంలో నటించే అవకాశం ఇస్తానని దర్శకుడు తెలిపారంది. అలా ఒక సారి ఫోన్‌ చేసి తమిళంలో ఒక చిత్రం చేస్తున్నానని, అందులో జ్యోతిక, కార్తీ, సత్యరాజ్‌ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారని చెప్పారని తెలిపింది. ఈ చిత్రంలో కార్తీకి జంటగా ఒక పాత్ర ఉంది, నువ్వు నటిస్తావా? అని అడిగారని చెప్పింది.

దర్శకుడు అంత నిజాయితీగా చెప్పడంతో తాను వెంటనే తంబి చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు చెప్పింది. ఉత్తమ కళాకారులతో నటించాలని తాను కోరుకుంటానని, అలాంటి మంచి అవకాశం ఈ చిత్రంలో లభించిందని అంది. తనకు తమిళ భాష తెలియడంతో ఈ చిత్రంలో నటించడం సులభం అనిపించిందని చెప్పింది. చాలామంది మాదిరిగానే తానూ నటుడు సూర్య, జ్యోతికలను తెరపై చూసి ఆనందించానని చెప్పింది. అలాంటిది ఇప్పుడు నటి జ్యోతకతో కలిసి ఈ తంబి చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని పేర్కొంది. సాధారణంగా చాలా చిత్రాల్లో ఆరంభంలో చిన్నచిన్న సన్నివేశాల్లో నటింపజేస్తారని అంది. అలాంటిది ఈ చిత్రంలో తాను తొలి రోజే డ్యూయెట్‌ సాంగ్‌లో నటించాల్సిన పరిస్థితి అని చెప్పింది. అదీ కాకుండా తొలి షాట్‌లోనే కార్తీతో లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించాల్సి రావడంతో చాలా భయపడ్డానని చెప్పింది. కార్తీ చాలా కూల్‌గా మాట్లాడి సహజంగా నటించమని చెప్పడంతో అలానే నటించినట్లు పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement