
టాలీవుడ్‌లో అతడికి ఓకే చెప్తా: కత్రినా
హైదరాబాద్: అందాల యువరాణి 'మల్లీశ్వరి'గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ కత్రినా కైఫ్. ఆపై అల్లరి పిడుగు మూవీ చేసిన క్యాట్స్.. టాలీవుడ్‌కు గుడ్ బాయ్ చెప్పేసి బాలీవుడ్‌కు పరుగులు తీసింది. కండలవీరుడు సల్మాన్ ఖాన్ అండతో వరుస ఆఫర్లతో కొన్నేళ్లపాటు అక్కడ టాప్ పొజిషన్‌లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. దుబాయ్‌లోని అబుదాబిలో ప్రతిష్టాత్మకంగా జరిగిన సైమా ( సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డు వేడుకల్లో మాజీ ప్రియుడు రణబీర్ కపూర్‌తో కలిసి పాల్గొని సందడి చేసింది. ఒక్కసారిగా సైమా వేడుకలకు హాజరైన ఈ భామను ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చాలా కాలంగా దూరంగా కత్రినాను మళ్లీ ఇక్కడ నటించాలంటే ఏ హీరోలతో జత కడతారని మీడియా ప్రశ్నించింది.
వెంటనే కత్రినా స్పందిస్తూ.. టాలీవుడ్‌లో నటిస్తే మాత్రం 'బాహుబలి' స్టార్ హీరో ప్రభాస్‌తో, కోలీవుడ్‌లో అయితే సీనియర్ హీరో విక్రమ్ సరసన జోడీ కట్టాలని ఉందని మనసులో మాటను వెల్లడించింది. 'బాహుబలి' మూవీ చూశాను, ప్రభాస్ ఎంతో చక్కగా నటించారు. 'చియాన్' విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అద్భుతమైన నటుడని కత్రినా కైఫ్ అభిప్రాయపడింది. మాజీ ప్రియుడు రణబీర్‌తో కలిసి కత్రినా నటించిన లేటెస్ట్ మూవీ 'జగ్గా జాసూస్'. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 14న విడుదలకు సిద్ధంగా ఉందని కత్రినా చెప్పింది.