
బాప్‌రే...బాలీవుడ్ భామల బడాయి
కత్రినా కాదు... శ్రద్ధా వద్దు... దిశా లేదు... ప్రభాస్ ‘సాహో’ టీమ్ హిందీ హీరోయిన్లను లిస్టులోంచి తీసేసిందట. తెలుగు హీరోయిన్నే తీసుకోవాలని ఫిక్సయ్యారట. ‘సాహో’ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో తీస్తున్నారు. సో, ప్రేక్షకులందరికీ తెలిసిన హిందీ భామను ప్రభాస్‌కు జోడీగా తీసుకోవాలనుకున్న మాట నిజమే. కానీ, కత్రినా కైఫ్ నుంచి శ్రద్ధా కపూర్, కృతీ సనన్, దిశా పాట్నీల వరకు ‘సాహో’ టీమ్‌తో వ్యవహరించిన తీరు చికాకు తెప్పించిందట! పైగా, ‘బాహుబలి–2’లో ప్రభాస్, అనుష్క జోడీను హిందీ ప్రేక్షకులు ఆదరించారు. అనుష్క దక్షిణాది హీరోయినే.
సో, సినిమా హిట్టవ్వాలంటే హిందీ హీరోయిన్ అవసరం లేదని దర్శకుడు సుజీత్, చిత్రనిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు డిసైడ్ అయ్యారని టీమ్ సన్నిహితులు చెబుతున్నారు. ‘సాహో’లో అనుష్క నటించే ఛాన్స్ ఎక్కువుందట. ‘మిర్చి’, ‘బాహుబలి’ టూ పార్ట్స్‌తో హిట్స్ అందుకున్న ఈ జోడీకి ‘బిల్లా’లోనూ మంచి పేరొచ్చింది. తమన్నా పేరు కూడా వినిపిస్తోంది. ఇక, హిందీ హీరోయిన్లు ఇచ్చిన బిల్డప్ ఇలా ఉందట. ఫిలింనగర్ వర్గాల కథనం మేరకు...
‘‘కత్రినా కాదు... ‘సాహో’ టీమ్ ఫస్ట్ ఛాయిస్ శ్రద్ధా కపూర్! ఆమెకు కథ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కానీ, రెమ్యునరేషన్ 8 కోట్లు అడిగింది. తెలుగులో హీరోయిన్లకు అంత అమౌంట్ ఎవరూ ఇవ్వడం లేదు. పైగా, శ్రద్ధా నటించిన ‘రాక్ ఆన్–2, ఓకే జాను’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. సో, రేటు కాస్త తగ్గిస్తుందేమో అని ప్రయత్నిస్తే... ‘ఐ లవ్ ద స్క్రిప్ట్. లవ్ టు వర్క్ విత్ ప్రభాస్. కానీ, రెమ్యునరేషన్ మాత్రం తగ్గదు’ అని శ్రద్ధా స్పష్టంగా చెప్పడంతో ‘సాహో’ టీమ్ శ్రద్ధాకు టాటా చెప్పేశారు’’
‘‘దిశా పాట్నీ హీరోయిన్‌గా పరిచయమైంది తెలుగులోనే. వరుణ్ తేజ్ ‘లోఫర్’ తర్వాత హిందీలో ‘ఎం.ఎస్. ధోనీ’, ఇండో–చైనీస్ ఫిల్మ్ ‘కుంగ్ ఫూ యోగా’ చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తీస్తున్న సినిమా కాబట్టి ఆమె చేస్తుందనుకున్నారు. శ్రద్ధా కపూర్ తర్వాత ‘సాహో’ టీమ్ దిశాను సంప్రదించారు. 5 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందామె. ‘హిందీలో దిశా పాట్నీకు 5 కోట్లు ఇచ్చే నిర్మాతలు ఎవరు?’ అని కూసింత కోపంగానే ‘సాహో‘ టీమ్ వెనక్కి వచ్చేసింది’’
‘‘బాహుబలి–2’ విడుదలకు ముందు ఆర్నెల్లు ‘సాహో’ టీమ్‌ను కత్రినా కైఫ్ తన వెంట తిప్పించుకుంది. ప్రభాస్‌కు జోడీగా నటించడం వల్ల తనకు ఏమాత్రం ఉపయోగం లేదన్నట్టు వ్యవహరించిందట. విసుగొచ్చి ఆమెను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనను పక్కన పెట్టేశారు. ఊహించిన దానికంటే ‘బాహుబలి–2’ భారీ హిట్టవ్వడంతో ‘ప్రభాస్ ‘సాహో’లో కత్రినా’ అనే ఫీలర్లను ఆమే విడుదల చేస్తోంది’’