ఫీమేల్‌ బడ్డీ డ్రామా ‘కిట్టి పార్టీ’ | Kitty Party Movie Logo Launched | Sakshi
Sakshi News home page

ఫీమేల్‌ బడ్డీ డ్రామా ‘కిట్టి పార్టీ’

Published Wed, Mar 6 2019 4:11 PM | Last Updated on Wed, Mar 6 2019 4:11 PM

Kitty Party Movie Logo Launched - Sakshi

ఆచార్య క్రియేషన్స్‌, బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న సినిమా ‘కిట్టి పార్టీ’. సుందర్‌ పవన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ‘మైనే ప్యార్‌ కియా’ (తెలుగులో ‘ప్రేమ పావురాలు’) ఫేమ్‌ భాగ్య శ్రీ, ‘రోజా’ ఫేమ్‌ మధుబాల, ‘పెళ్లి సందడి’ ఫేమ్‌ దీప్తీ భట్నాగర్‌, సదా, సుమన్‌ రంగనాథ్‌, హరితేజ, హర్షవర్ధన్‌ రాణే, పూజా జవేరిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా లోగో విడుదల చేశారు.

అనంతరం దర్శకుడు సుందర్‌ పవన్‌ మాట్లాడుతూ ‘ఇదొక ఫీమేల్‌ బడ్డీ డ్రామా. అలాగని, ఆడవాళ్ళకు సంబంధించిన సినిమా అని చెప్పను. కానీ, సినిమాలో ఆడవాళ్ళు మాత్రమే ఎక్కువసేపు కనిపిస్తారు. నాకు తెలిసిన కొన్ని నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నా. స్ట్రయిట్‌ తెలుగు సినిమా ఇది. ఏ పరభాషా సినిమాకూ రీమేక్‌ కాదు. వేరే సినిమా స్ఫూర్తితో తీయడం లేదు. ముఖ్యంగా ఆరుగురు మహిళలు చుట్టూ కథ తిరుగుతుంది. భాగ్య శ్రీ, దీప్తీ భట్నాగర్‌, సుమన్‌ రంగనాథ్‌, మధుబాల, సదా, హరితేజ, పూజా జవేరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో మరిన్ని సినిమా వివరాలు వెల్లడిస్తాం’ అన్నారు.

భాగ్య శ్రీ మాట్లాడుతూ ‘జీవితంలో ఒక్క మహిళను హ్యాండిల్‌ చేయడమే పురుషులకు కష్టమైన పని! నవ్వుతూ... మా దర్శకుడు సెట్‌లో మా ఏడుగురు మహిళలను  హ్యాండిల్‌ చేయాలి. ఎలా చేస్తాడో! మహిళల దృక్కోణం నుంచి ఆలోచించి ఈ కథ రాసిన దర్శకుడు పవన్‌ని అభినందిస్తున్నా. మహిళల మనస్తత్వాలను అర్థం చేసుకున్నటువంటి దర్శకుడితో పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా హాలీవుడ్‌లో వచ్చిన ‘డెస్పరేట్‌ హౌస్‌వైఫ్స్‌’, ‘సెక్స్‌ అండ్‌ ది సిటీ’ సినిమాల తరహాలో ఉంటుంది. ప్రేక్షకులకు తమ జీవితాల్లో ప్రతిరోజూ తారసపడే మహిళల్లో ఎవరో ఒకరు మా పాత్రల్లో ఏదో పాత్రలో కనిపిస్తారు.’ అన్నారు.

మధుబాల మాట్లాడుతూ ‘హీరోపై మాత్రమే ఎక్కువ ఫోకస్‌ చేసే ఇండస్ట్రీలో... హీరో ఎవరూ లేని ఒక సినిమాకు నేను సంతకం చేశా. ఇంటర్వ్యూలలో మెరిల్‌ స్ట్రీప్‌ వంటి హాలీవుడ్‌ తారలు మెయిన్‌ లీడ్స్‌గా సినిమాలు చేస్తున్నారని చెబుతుంటాం. మేముందుకు అటువంటి సినిమాలు, అటువంటి అద్భుతమైన పాత్రల్లో నటించలేం? ఇప్పుడు చేస్తున్నాం. ఇందులో నేనొక మెయిన్‌ లీడ్‌గా, పూజా జవేరికి తల్లిగా నటిస్తున్నా. నా చిన్ననాటి స్నేహితురాళ్ళు సుమన్‌, భాగ్య శ్రీతో నటిస్తుండటం సంతోషంగా ఉంది’ అన్నారు.

దీప్తీ భట్నాగర్‌ మాట్లాడుతూ ‘హైదరాబాద్‌ రావడం, అదీ 20 ఏళ్ళ తర్వాత రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిటీ నా ఫస్ట్‌ లవ్‌. నాకింకా ‘పెళ్లి సందడి’ సినిమా షూటింగ్‌ చేసిన రోజులు గుర్తున్నాయి. ఈ సినిమా ఎప్పటికీ నా మనసులో ఉంటుంది. చాలా విరామం తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో నటిండచం సంతోషంగా ఉంది’ అన్నారు. సుమన్‌ రంగనాథ్‌ మాట్లాడుతూ ‘నేను తెలుగులో రెండు మూడు సినిమాలు చేశాను. మళ్ళీ తెలుగులో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో కథే హీరో’ అన్నారు.

హరితేజ మాట్లాడుతూ ‘నిజంగానే పార్టీలా ఉంటుందీ సినిమా. చక్కగా, హాయిగా మూడు గంటలు ఎంజాయ్‌ చేసే సినిమా అవుతుంది. ప్రేక్షకులు అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఒక అమ్మాయి జీవితంలో పార్టీలు, సరదాలు, ఫన్‌ ఒక స్టేజ్‌ తర్వాత అయిపోయాక... బాధ్యతలు పెరిగాక... వాటి నుంచి మళ్ళీ ఒక టీనేజ్‌లోకి వచ్చే స్టోరీ ఎంత గమ్మత్తుగా ఉంటుందో? అక్కడ స్నేహితులు ఎలా ఉంటారో? అనే విషయాలు సినిమాలో చూడొచ్చు. నేను చెప్పింది సినిమాలో ఇసుక రవ్వంతే. ఇంకా చాలా ఉంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement