'క్రిష్ 3'ని కథ ఓడించింది!
'క్రిష్ 3'ని కథ ఓడించింది!
Published Fri, Nov 1 2013 2:47 PM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
రోహిత్ మెహ్రా గొప్ప సైంటిస్ట్. నిర్జీవమైన వాటిలో మళ్లీ జీవం నింపడానికి రోహిత్ పరిశోధన చేస్తుంటాడు. రోహిత్ కుమారుడు క్రిష్ అలియాస్ కృష్ణ. ఎవరికి ఆపదవచ్చినా.. క్రిష్ రూపంలో ఆదుకుంటాడు కృష్ణ. రోహిత్ డీఎన్‌ఏ ద్వారా జన్మించిన కాల్.. ఒక ఫార్మా కంపెనీకి అధినేత. భయంకరమైన వైరస్ సృష్టించి ప్రపంచాన్ని నాశనం చేయాలని ఓ పన్నాగం పన్నుతాడు. అయితే రోహిత్ తన అనుభవాన్ని రంగరించి.. వైరస్‌ను ఆపివేయడంలో సఫలీకృతమవుతాడు. తన ప్లాన్లను భగ్నం చేసిన రోహిత్‌పై పగ తీర్చుకోవడానికి గర్భిణిగా ఉన్న క్రిష్ భార్యను కాల్ ఎత్తుకెళ్లుతాడు. తన భార్యను క్రిష్ ఎలా రక్షించుకుంటాడు? కాల్ దుష్ట ప్రయత్నాలను ఎలా ముగింపు పలికాడు అనే ప్రశ్నలకు సమాధానమే ’క్రిష్ 3’ చిత్రం.
రోహిత్ మెహ్రా, క్రిష్, కృష్ణ రెండు విభిన్న షేడ్స్ ఉన్న హృతిక్ పోషించాడు. కథలో పస లేకపోవడంతో రోహిత్, కృష్ణ పాత్రల ద్వారా నటనను ప్రదర్శించేందుకు అంతగా స్కోప్ లేకపోయింది. క్రిష్ పాత్ర ద్వారా హీరోయిజం చూపించడానికి కొంత అవకాశం కలిగింది.
ఇటీవల కాలంలో మీడియాలో ఈ చిత్రంలో తానే ఫస్ట్ హీరోయిన్ అంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చిన ప్రియాంక చోప్రా పాత్రకు పెద్దగా ప్రాధ్యాన్యత లేకపోయింది. కాల్ సృష్టించిన నలుగురు దుష్ట శక్తుల్లో ఒకరైన కాయా(కంగనా రనౌత్) విలన్ షేడ్స్ ఉన్న పాత్ర కొంత మెరుగ్గా ఉందన్న ఫీలింగ్ కలిగినప్పటికి.. క్రిష్3 కి ఎలాంటి అదనపు ఆకర్షణ కాలేకపోయింది. ప్రియాంక కంటే కంగనా రనౌత్ అందాల ఆరబోతలో కాస్తా పైచేయి సాధించింది. కాల్ పాత్ర ద్వారా విలన్ గా దర్శనమిచ్చిన వివేక్ ఒబెరాయ్‌కి మంచి మార్కులే పడ్డాయి.
క్రిష్ 3 చిత్రం ప్రేక్షకుల అంచనాలకు తగినట్టు లేకపోవడానికి దర్శకుడు రాకేశ్ రోషన్ తప్పటడుగులే ప్రధాన కారణం. కథలో బలం లేకపోవడం, కథనం పేలవంగా ఉండటం ఆద్యంతం ప్రేక్షకుడిని విసిగించింది. చిత్ర కథ ఫ్లాట్ గా ఉండటంతో ఎక్కడ ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ స్థాయిలో క్రిష్ ను తీర్చి దిద్దాలనుకున్న రాకేశ్ రోషన్ ఆప్రయత్నంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు.
థియేటర్‌లో విసిగిన ప్రేక్షకుడికి క్లైమాక్స్‌లో యాక్షన్ స్వీక్వెన్స్, గ్రాఫిక్ పనితీరు కొంత ఉపశమనం కలిగించే విధంగా ఉన్నప్పట్టికి..చిత్రాన్ని గట్టెంక్కించేంత శక్తి లేకపోయింది. సాంకేతిక వర్గ పనితీరు, గ్రాఫిక్ వర్క్ భారతీయ చిత్రాలను మించేలా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి కొంత పాజిటి వ్ అంశమే అయినప్పటికి..పాటలు ఆకట్టుకోలేకపోయాయి. సినిమాలో బలవంతుడైన క్రిష్3ని పసలేని కథ సునాయాసంగా ఓడించింది. ఓవరాల్‌గా వినోదాన్ని ఆశించి, కొత్తదనం కోసం థియేటర్‌కెళ్లిన ప్రేక్షకుడికి నిరాశే మిగలడం ఖాయం.
Advertisement