ఈత దుస్తులకు సిద్ధం
తమిళసినిమా: క్షణ క్షణంబుల్ మారున్ జవరాలి చిత్తం అని పెద్దలు ఊరకే అనలేదు. సినీ తారల విషయానికొస్తే ఈ విషయం నూరుపాళ్లు నిజమని చెప్పాలనిపిస్తుంది. వీటి మాటలకు, చేతలకు పొంతన ఉండదు. నటి లక్ష్మీమీనన్ సంగతే చూడండి. తన శారీరక భాషకు గ్లామర్ పాత్రలు అస్సలు నప్పవు. ఇది ఇంతకు ముందు మాట. గ్లామరే కాదు, స్విమ్ దుస్తులు ధరించడానికీ సిద్ధమే. ఇది ఇప్పటి మాట. ఈ అమ్మడు పట్టుమని పది చిత్రాలయినా చేయలేదు.
ఇంతలోనే అభిప్రాయంలో ఎంత మార్పో చూడండి. లక్ష్మీమీనన్ మంచి నటే. లక్కీ కథానాయకి కూడా. ప్రస్తుతం అవకాశాలు అంతంత మాత్రమే. ఇందుకు చదువు మీద దృష్టి లాంటి వ్యక్తిగత అంశాలు ఒక కారణం కావచ్చు. ఈ అమ్మడు అజిత్‌కు చెల్లెలిగా నటించిన వేదాళం చిత్రం దీపావళి పండగ సందర్భంగా ఈ నెల 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా లక్ష్మీమీనన్‌తో చిన్న భేటీ.
ప్ర: కథానాయికగా నటిస్తూ వేదాళం చిత్రంలో అజిత్‌కు చెల్లెలిగా నటించడానికి కారణం?
జ: చిత్ర కథ నచ్చింది. అందులో నా పాత్ర ఇంకా బాగా నచ్చింది. అందుకే చెల్లెలి పాత్రకు అంగీకరించాను. వేదాళం చిత్రం చూసిన వారికి అందులో తమిళ్ అనే నా పాత్ర బాగా నచ్చుతుంది.
ప్ర: అజిత్ నుంచి నేర్చుకున్నది?
జ: ప్రశాంతంగా ఉండటం. సెట్‌లో ఒక హలో ఒక హాయ్ అంతే. నా పని ముగియగానే ఒక పక్కన కూర్చుంటాను. అజిత్ అంతే అవసరం ఉంటేనే మాట్లాడతారు. లేకుంటే చాలా ప్రశాంతంగా ఉంటారు.
ప్ర: ఇంతకు ముందు కొంబన్ లాంటి చిత్రాల్లో గ్రామీణ పాత్రల్లో నటించారు. అలాంటి పాత్రల్నే ఇష్టపడుతున్నారా లేదా నగర యువతి పాత్రలో నటించాలని కోరుకుంటున్నారా?
జ: నిజం చెప్పాలంటే గ్రామీణ కథా చిత్రాలు నాకు నప్పడం లేదు. అలాంటి అవకాశాలే ఎక్కువగా వస్తున్నాయి. నాకు మాత్రం మోడ్రన్ పాత్రలు ధరించడం అంటేనే ఇష్టం.
ప్ర: ప్రస్తుతం దెయ్యాల చిత్రాల ట్రెండ్ న డుస్తోంది. మీరూ అలాంటి చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నారా?
జ: ఇప్పటి వరకూ అలాంటి అవకాశం రాలేదు. ఇకపై వస్తే తప్పకుండా నటిస్తాను. ఎలాంటి చిత్రం అయినా అందులో నా పాత్ర నచ్చాలి.
ప్ర: ఇప్పటి వరకూ నటించిన వాటిలో మీకు నచ్చిన చిత్రం?
జ: నాన్ శివప్పుమణిదన్
ప్ర: భరతనాట్యం నేర్చుకున్నారు. నటిగా రాణిస్తున్నారు. ఇప్పుడు గాయనీ అవతారం కూడా ఎత్తారు. వీటిలో ఏదంటే ఎక్కువ ఇష్టం?
జ: నటనకంటే పాడటమంటేనే నాకు చాలా ఇష్టం. సంగీత దర్శకులు డీ.ఇమాన్. తమన్ చిత్రాల్లో పాడాను. ఇతర సంగీత దర్శకులు అవకాశం ఇచ్చినా పాడటానికి సిద్ధమే. పాడిన తర్వాత ఆ పాటను పూర్తిగా విన్నప్పుడు కలిగే ఆనందమే వేరు.
ప్ర: అభిమానులు మిమ్మల్ని ఎలాంటి దుస్తుల్లో చూడాలని కోరుకుంటున్నారు?
జ: నాకు తెలిసి అధిక మంది అభిమానులు లంగా ఓణీల్లోనే చూడాలని కోరుకుంటున్నారు.
ప్ర: మీరు ఎంతకాలం ఇలా లంగా ఓణీ పాత్రల్లో నటిస్తారు. గ్లామర్ పాత్రలు పోషించాలన్న ఆశ లేదా?
జ: అలాంటిదేమీ లేదు. గ్లామర్ పాత్రల్లోనూ నటిస్తాను.
ప్ర: ఈత దుస్తులు ధరించి నటిస్తారా?
జ: చిత్ర కథకు అలాంటి దుస్తులు అవసరం అయితే తప్పకుండా నటిస్తాను. సన్నివేశం ప్రాముఖ్యత తెలిసిన తరువాత నటించనని చెప్పను.
ప్ర: మీరు నటించిన వేదాళం చిత్రం దీపావళికి తెరపైకి రానుంది. సంతోషంగా ఉందా? టెన్షన్‌గా ఉందా?
జ: ఎలాంటి టెన్షన్ లేదు. టెన్షన్ అన్నది ఎరుగని క్యారెక్టర్ నాది. ఒక చిత్రం పూర్తి చేశానంటే తదుపరి చిత్రానికి రె డీ అయిపోతాను. దీపావళికి వేదాళం చిత్రం విడుదలవడం సంతోషమే.
ప్ర: కేరళలో ఉంటూ షూటింగ్‌ల కోసం చెన్నై తదితర ప్రాంతాలకు వచ్చి వెళ్లడం శ్రమ అనిపించడం లేదా?
జ: చెన్నైకి మకాం మార్చే ఆలోచన నాకు లేదు. ఇంతకు ముందు నాతో అమ్మ కూడా వచ్చేది. ఇప్పుడు నేను ఒంటరిగానే వస్తున్నాను. ఎప్పుడైనా అమ్మమ్మ కూడా వస్తుంటుంది. అలా షూటింగ్‌లకు వచ్చి వెళ్లడం నాకు శ్రమ అనిపించడం లేదు.
ప్ర: మరి పెళ్లి మాటేమిటీ? ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?
జ: అయ్యయ్యో అసలు పెళ్లే వద్దనుకుంటుంటే ప్రేమా, దోమా అంటారేమిటి. ఒక వేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే అది పెద్దలు కుదిర్చిన వివాహమే అవుతుంది.
ప్ర: అవకాశాలు తగ్గినట్లున్నాయే?
జ: అదేమీలేదు. చాలా అవకాశాలు వస్తున్నా అన్నీ అంగీకరించడం లేదు. నచ్చిన కథా చిత్రాలే చేస్తున్నాను. వేదాళం తర్వాత జయం రవి సరసన ఒక చిత్రం చేస్తున్నాను.