
మా ఎన్నికల ఫలితాలు నేడే
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలు కొన్ని గంటల్లో తేలిపోనున్నాయి. ఫలితాలు వెల్లడించేందుకు సిటీ సివిల్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఫిల్మ్ చాంబర్లో ఓట్లు లెక్కించనున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించడం, దానికితోడు కేవలం 394 మంది సభ్యులు మాత్రమే ఓట్లు వేయడంతో ఓట్ల లెక్కింపు ప్రారంభించినప్పటి నుంచి ఫలితాలు వెలువడేందుకు కేవలం అరగంట సమయం మాత్రమే పడుతుందని అంచనా. మొత్తం 702 మంది సభ్యులున్న 'మా' అధ్యక్ష పదవి కోసం జయసుధ, రాజేంద్రప్రసాద్ పోటీ పడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు మార్చి 29వ తేదీన జరిగాయి.
ఎన్నికలను నిలిపివేయాలని నిర్మాత ఓ కళ్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కోర్టు కొట్టేసింది. దాంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఈ ఫలితాలను ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలపనున్నారు.