
సాక్షి, న్యూఢిల్లీ : సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘మహానటి’చిత్రం అద్భుతంగా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఈ చిత్రం ద్వారా సావిత్రికి నిజమైన నివాళి అర్పించినట్లైందని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన ఢిల్లీలో కేంద్ర సమాచార శాఖకు చెందిన ప్రత్యేక థియేటర్‌లో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, నిర్మాత అశ్వనీదత్ ఇతర ప్రముఖులతో కలిసి మహానటి చిత్రాన్ని వీక్షించారు. సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలను అధ్యయనం చేసి సావిత్రి గొప్పతనాన్ని నేటి తరానికి అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత ప్రియాంక దత్, సావిత్రి కీర్తిని తెలియజేసేలా సహజసిద్ధంగా నటించిన నటి కీర్తి సురేశ్‌ను వెంకయ్య అభినందించారు. మాయాబజార్‌లో సావిత్రి నటన ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.