మంగళూరులో హంగామా
షర్ట్ లేకుండా ఏ సినిమాలోనూ కనిపించని మహేష్‌బాబు... ‘1’ సినిమా కోసం ఏకంగా సిక్స్ ప్యాక్ చేసేశారు. ఇక్కడున్న మహేష్ స్టిల్ చూడండి... సిక్స్‌ప్యాక్ సూచా యగా కనిపిస్తోంది. సాధారణంగా సిక్స్ ప్యాక్ చేస్తే... ఫేస్‌లో బ్యూటీ పోతుందంటారు. చాలామంది హీరోల విషయంలో అది జరిగింది కూడా. కానీ మహేష్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఏ మాత్రం గ్లామర్ చెడ కుండా... ఎప్పటిలాగే మిల్కీబోయ్‌లా ఉన్నారు ప్రిన్స్. ఏడాదిన్నర నుంచి ఈ సినిమా కోసమే అహర్నిశలూ శ్రమిస్తున్నారాయన.
దీన్ని బట్టి... ‘1’ సినిమాపై మహేష్ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే.. ప్రతిష్టాత్మకంగా సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథానాయకుడి పాత్రలను భిన్నంగా మలిచే సుకుమార్ ఈ సినిమాలో కూడా మహేష్ పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేసినట్లు తెలిసింది. ఇందులోని మహేష్ పాత్ర ప్రవర్తించే తీరు ఊహలకు అతీతంగా ఉంటుందట. మహేష్ కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని పాత్రను ఇందులో చేస్తున్నట్లు వినికిడి. కథ, కథనాల విషయంలో హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం.
లండన్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించారు సుకుమార్. ఈ నెల 25 నుంచి మంగళూరులోని డాక్‌యార్డ్, బీచ్ ప్రాంతాల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సినిమాకే హైలైట్‌గా నిలిచేలా ఈ సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఎట్టిపరిస్థితుల్లో నవంబర్ చివరికల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర కృతనిశ్చయంతో ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను డిసెంబర్ రెండో వారంలో విడుదల చేసి,
సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మహేష్ తనయుడు గౌతమ్‌కృష్ణ బాలనటునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో కీర్తి సనన్ కథానాయిక. నాజర్, సయాజీ షిండే, కెల్లీ డోర్జీ, విక్రమ్ సింగ్, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, కూర్పు: కార్తీక శ్రీనివాస్, నిర్మాణం: 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్.