
ఫేస్ బుక్ లైవ్‌లో కత్తి మహేష్
తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై టాలీవుడ్ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ స్పందించారు. సునీతా అనే అమ్మాయి పలు టెలివిజన్ ఛానెల్‌లో మహేష్‌పై సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ ఆదివారం తన ఫేస్‌బుక్ లైవ్ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. ‘ఆ మహిళ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఒక ఛానెల్‌లో ఒకరకంగా.. మరో ఛానెల్‌లో మరో రకంగా... పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. అక్కడే ఆమెకు సరైన శిక్షణ ఇవ్వకుండా నాపై ఆరోపణలు చేయించారన్నది ప్రజలకు అర్థమైపోయి ఉంటుంది. అసలు వాటిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నేనేంటో నాకు, నా సన్నిహితులకు తెలుసు. కానీ, పబ్లిక్ డొమైన్‌లో ఉన్నప్పుడు దాని నుంచి క్లీన్‌గా బయటపడాల్సిన అవసరం నాకు ఉంది..
.. ఇక్కడ నా ధర్మ సందేహం ఏంటంటే... నాపై ఆరోపణల వెనుక కొణిదెల ప్రొడక్షన్ హస్తం ఉందా? లేదా? అన్నది తేలాలి. నన్ను ఇరికించేంత అవసరం వాకాడా అప్పారావుకు లేదనే నేను అనుకుంటున్నా. ఇండస్ట్రీలో సమస్యల గురించి.. స్టార్ హీరోల గురించి మాట్లాడుతున్న ఏకైక వ్యక్తి నేను. అలాంటిది నా నోరు మూయించటానికి ఇంత కుచ్చితమైన పనులు చేయాలా? తప్పు ఒప్పుకుని దానిని సరిదిద్దుకోవాల్సిన ఇండస్ట్రీలోని సో కాల్డ్ పెద్ద మనుషులు.. నా నోరు మూయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ లెక్కన్న ఇండస్ట్రీకి ఎవరు హని చేస్తున్నారని గుర్తించాలని ప్రజలను గమనించాలి’ అని మహేష్ పేర్కొన్నారు. ఇకపై తనపై ఆరోపణలు చేసిన సునీతపై రూ.50 లక్షలకు దావా వేయనున్నట్లు మహేష్ ప్రకటించారు.
... ఇండస్ట్రీలో ప్రతీ వ్యవహారంపై స్పందించే వ్యక్తిని తానని .. శ్రీరెడ్డి వ్యవహారంలో కూడా తాను చర్చల్లో పాల్గొన్నవిషయాన్నిమహేష్ గుర్తు చేసుకున్నారు. ‘ ఎవరైనా ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయటం కుదరదు. వాటిని నిరూపించాల్సి ఉంటుంది. లేదంటే గుణపాఠం తప్పదు. నాపై కుట్రలు చేసే వారికి నేను చెబుతుంది ఒక్కటే..చట్టాలు మీ కంటే నాకు బాగా తెలుసు. పిల్లి బిత్తిరి వేషాలకు నేను భయపడను. అది మెగాస్టార్ అయినా.. పవర్‌స్టార్ అయినా... మెగాపవర్ స్టార్ అయినా భయపడాల్సిన అవసరం నాకు లేదు. నా విషయంలో దిగజారి వ్యవహరిస్తే మీ పెద్దరికాలే పోతాయి. నా వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా కొందరు వ్యవహరించారు. ఇక ఓపిక పట్టాల్సిన అవసరం నాకు లేదు. నాపై ట్రోలింగ్, విమర్శలు చేస్తున్న వారు మాత్రం కాస్త ఓపిక పట్టండి. రెండు మూడు రోజుల్లో అందరి బతుకులు బయటపెడతా’అని మహేష్ పేర్కొన్నారు.
కత్తి మహేష్ మీడియాకు విడుదల చేసిన నోట్ ఇదే...
స్త్రీలని నేను అపురూపంగా చూసుకుంటాను. గౌరవంగా, స్నేహపూర్వకంగా వాళ్ళతో మెలుగుతాను. ప్రేమిస్తే,ప్రేమని వ్యక్తపరుస్తాను. కాంక్షిస్తే, అంతే గౌరవంగా చెప్తాను. కాదంటే వాళ్ళ అభిప్రాయాన్ని సగౌరవంగా అంగీకరిస్తాను. ఆ తరువాత ఎప్పటికీ ఆ ప్రస్తావన రాకుండా నా స్నేహాన్ని గౌరవంగా కొనసాగిస్తాను. నాకు నైతికత వ్యక్తిగతం. అదే నేను పాటించే విలువ.
నా మీద వచ్చిన ఆరోపణ ఒక కుట్రలో భాగం. ప్రస్తుతం జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ చర్చలకి,ఈ ఘటనకి అసలు సంబంధం లేదు. లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు.అది నిరూపించుకోవడంలో భాగంగా ఆ స్త్రీ మీద నేను 50 లక్షలకి పరువునష్టం దావా వేస్తున్నాను.
నా జీవితంలో ఉన్న స్త్రీలు, నేనంటే ఏమిటో తెలిసిన మిత్రులు, వ్యక్తులకు నేను ప్రత్యేకంగా నా వ్యక్తిత్వం గురించి చెప్పనక్కరలేదు. కానీ,ఈ సందర్భంలో ఒక పబ్లిక్ స్టేట్ మెంట్ అవసరం అనిపించి ఇది రాస్తున్నా.
ధన్యవాదాలు
కత్తి మహేష్