తెరకు అందాన్నిచ్చే హీరో మహేశ్ : శంకర్
‘‘మహేశ్ సినిమాలు మొదట్లో పెద్దగా చూడలేదు. ‘ఒక్కడు’ నుంచి రెగ్యులర్‌గా చూడ్డం మొదలుపెట్టాను. అతని సినిమాల్లో ‘దూకుడు’ నా ఫేవరెట్ మూవీ. తెరకు అందాన్నిచ్చే హీరో మహేశ్. ఎమోషన్, రొమాన్స్, కామెడీ.. ఇలా ఏ రసాన్నయినా కొలత ప్రకారం చేయడం మహేశ్‌లోని ప్రత్యేకత’’ అని ప్రముఖ దర్శకుడు శంకర్ అన్నారు. మహేశ్ కథానాయకునిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘ఆగడు’. సంగీత దర్శకునిగా తమన్ 50వ చిత్రమిది. ఈ సినిమా పాటలను శనివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు.
శంకర్ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని మహేశ్‌కి అందించారు. శంకర్ ఇంకా మాట్లాడుతూ -‘‘తమన్ మంచి డ్రమ్మర్. ‘బాయ్స్’ సినిమా ఆడిషన్స్ టైమ్‌లో డ్రమ్స్ ప్లే చేస్తుండేవాడు. ట్యూన్స్ వినిపిస్తుండేవాడు. అతను ఈ రోజు ఈ స్థాయికి రావడం గర్వంగా ఉంది. అతని ఆల్బమ్స్‌లో ‘దూకుడు’ నా ఫేవరెట్. ఒక సినిమాను కమర్షియల్ ప్యాక్‌లా చేయడం తేలికైన విషయం కాదు. ఈ విషయంలో శ్రీను వైట్లను అభినందించాలి. బ్రహ్మానందంకి గొప్ప ఫ్యాన్‌ని. ఈ కాంబినేషన్ మళ్లీ విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘చెన్నైలో ఉన్నప్పుడు శంకర్‌గారి సినిమాలు విడుదలవగానే, తొలిరోజు బ్లాక్ టికెట్ కొని మరీ చూసేవాణ్ణి.
ఈ రోజు ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. 50 సినిమాల సంగీత దర్శకుడైన తమన్‌కి శుభాకాంక్షలు. టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. ఈ సినిమా నిర్మాతలకు సినిమాపై ఉన్నంత పిచ్చి ప్రేమ ఎవరికీ ఉండదు. వీళ్లతో ఇలాంటి సూపర్‌హిట్లు మళ్లీ మళ్లీ చేయాలనుంది. శ్రీను వైట్లతో వర్క్‌ను ఎంజాయ్ చేస్తాను. ‘దూకుడు’ షూటింగ్ టైమ్‌లోనే ‘మన నెక్ట్స్ సినిమా పేరు ‘ఆగడు’’ అని చెప్పేశాడు. అప్పుడు, ఇప్పుడు శ్రీను వైట్ల చెప్పింది చెప్పినట్లు చేశాను. సెప్టెంబర్ 19న సినిమా విడుదల కానుంది.
దసరా పండగను రెండు వారాల ముందే జరుపుకుందాం’’అని మహేశ్ అన్నారు. శ్రీనుై వెట్ల చెబుతూ -‘‘తమన్ ఈ ఆల్బమ్ కోసం ఏడాది కష్టపడ్డాడు. కథ అడిగింది ఇచ్చే నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర. ఇలాంటి నిర్మాతలు గతంలో నా సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం కావడం ఆనందంగా ఉంది. ‘దూకుడు’లో మహేశ్ పవర్‌ని పది శాతమే చూశారు. ‘ఆగడు’లో వంద శాతం చూస్తారు’’ అన్నారు. నాజర్, బ్రహ్మానందం, సుకుమార్, సుధీర్‌బాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కోటి పరుచూరి, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు.