
హింసను తగ్గించడానికి సంగీతమే మార్గం!
సంగీతానికి ఉన్న మహత్తర శక్తితో హింసను జయించవచ్చునని, పాఠశాలల్లో సంగీత పాఠాలను తప్పనిసరి చేయడం వల్ల సమాజంలో హింస తగ్గుముఖం పట్టే అవకాశముందని లెజండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా పేర్కొన్నారు.
పనాజీ: సంగీతానికి ఉన్న మహత్తర శక్తితో హింసను జయించవచ్చునని, పాఠశాలల్లో సంగీత పాఠాలను తప్పనిసరి చేయడం వల్ల సమాజంలో హింస తగ్గుముఖం పట్టే అవకాశముందని లెజండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా పేర్కొన్నారు. పనాజీలో జరుగుతున్న 46వ అంతర్జాతీయ భారతీయ చిత్రోత్సవంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న సందర్భంగా ఆయన ప్రసంగించారు. సంగీతానికి దివ్యశక్తితో సమాజంలో చోటుచేసుకుంటున్న హింసను నిరోధించవచ్చునని పేర్కొన్నారు. 'పాఠశాలలు, కళాశాలలు.. ఇలా ప్రతిచోటా సంగీతాన్ని తప్పనిసరి చేయండి. హింస దానంతట అదే తగ్గుముఖం పడుతుంది' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కూడా పాల్గొన్నారు.
కొన్ని దశాబ్దాల పాటు దక్షిణాది సినీ సంగీతాన్ని శాసించి.. అనేక సరికొత్త బాణీలతో సంగీతప్రియుల మదిలో చోటు సంపాదించుకున్న ఇళయరాజాను అనేక పురస్కారాలు వరించాయి. ఆయన సంగీతానికి పలుమార్లు జాతీయ చలనచిత్రం పురస్కారాలు లభించాయి. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో ఆయనను సత్కరించింది.