‘ఛయ్యా ఛయ్యా’ పాటతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి మలైకా అరోరా. ఈ ఒక్క పాటతో ఆమె కెరీర్ బాలీవుడ్‌లో రాకెట్‌లా దూసుకెళ్లిపోయింది. అయితే ఈ పాటను చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె చాలా తీవ్రంగా గాయపడ్డారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు మలైకా.
ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ.. ‘పాట మొత్తం కదులుతున్న రైలు పైనే చిత్రీకరించారు. గాలి బలంగా వీస్తుండటంతో నేను చాలా సార్లు పట్టుతప్పి పడిపోయాను. దాంతో నేను పడిపోకుండా ఉండటానికి నేను ధరించిన గాగ్రాకి తాడు కట్టి, రైలుకు కట్టేశారు. ఆ తాడు కట్టుకునే డ్యాన్స్ చేశాను. పాట షూటింగ్ అయిపోయాక తాడు విప్పుతుంటే నడుమంతా రక్తమోడుతోంది. తాడు కట్టడం వల్ల రాసుకుపోయి ఇలా జరిగింది. దాంతో సెట్లో ఉన్న వారంతా కంగారుపడిపోయారు’ అని తెలిపారు మలైకా. మణిరత్నం దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘దిల్ సే’ చిత్రంలోని ఈ పాటకు ఫరాఖాన్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. బెస్ట్ కొరియోగ్రఫీ కేటగిరీలో ఫరాఖాన్‌కు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. ఇప్పటికీ పాటకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
Comments
Please login to add a commentAdd a comment