ముద్దు పెట్టుకోవడం తప్పేమీ కాదు!
‘కిస్ ఆఫ్ లవ్’... ఈ వ్యవహారం ప్రస్తుతం చాపకింద నీరులా దేశం మొత్తం వ్యాప్తి చెందుతోంది. కేరళ బీచ్‌లో నిదానంగా మొదలై ఇప్పుడో ఉద్యమంలా రూపుదాల్చుతోంది. ‘పరస్పరం ప్రేమించుకున్నప్పుడు బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం తప్పుకాదు..’ అనేది ‘కిస్ ఆఫ్ లవ్’ కాన్సెప్ట్. దీనిని వ్యతిరేకించేవారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. కేరళ రాష్ట్రంలో ‘కిస్ ఆఫ్ లవ్’ నిర్వహించాలనుకున్నప్పుడు ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) వాళ్లు అడ్డుకోవడంతో ఘర్షణలు జరిగాయి. పోలీసులు కూడా ‘మోరల్ పోలీసింగ్’ చేస్తూ ఈ ముద్దుల పండుగను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
దీనిపై ఇప్పటివరకూ సినిమా సెలబ్రిటీలెవరూ స్పందించలేదు. అయితే... మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మాత్రం సామాజిక మాధ్యమం ద్వారా ‘కిస్ ఆఫ్ లవ్’కి మద్దతు పలికారు. ‘‘నచ్చిన వారిని ముద్దు పెట్టుకునే హక్కు మనకుంది. అంతే తప్ప మన ముందు ఇతరులు ముద్దు పెట్టుకోకూడదు అని నియంత్రించే హక్కు ఎవరికీ లేదు. ‘ముద్దు’ అనేది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. దీన్ని చట్టపరిధిలోకి తీసుకురావడం తప్పు’’ అని పేర్కొన్నారు మోహన్‌లాల్. ‘మోరల్ పోలీసింగ్’పై స్పందిస్తూ- ‘‘ప్రేమను తెలియజెప్పే గొప్ప సాధనం ముద్దు. దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం.
వంతెనలు కూలిపోతున్నప్పుడు, రోడ్లు గోతులుగా మారిపోతున్నప్పుడు, పసికందులు అత్యాచారాలకు గురి అవుతున్నప్పుడు, తాగే నీరు కలుషితంగా మారుతున్నప్పుడు, కన్న తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి వెళ్లగొడుతున్నప్పుడు, యాక్సిడెంట్ జరిగి చావు బతుకుల్లో పడి ఉన్న మనిషిని పట్టించుకోకుండా ఎవరి మానాన వాళ్ల్లు పోతున్నప్పుడు.. పట్టించుకోనివాళ్ళకు ఈ బహిరంగ చుంబనం మాత్రం ఘోరంగా కనిపించటం శోచనీయం. ఇష్టం లేకపోతే తల తిప్పుకోండి. బాహాటంగా ముద్దు పెట్టుకోవడం తప్పేమీ కాదు’’ అని ఘాటుగా స్పందించారు మోహన్‌లాల్.