మారుతున్న కాలంతో సమాజంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల్లో స్వేచ్ఛ, స్వాతంత్రం పెంపొందుతున్నాయి. నిజం చెప్పాలంటే ఇది ఆహ్వానించదగ్గ విప్లవాత్వకమైన ప్రగతి పథమే. ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా ఎదుగుతున్నారు. ఇదీ అందరూ కోరుకుంటున్న అంశమే. అయితే ఇంకా మగువలను ఆటబొమ్మగా చూసే వారు లేకపోలేదు. మరి కొందరు స్త్రీలను కుటుంబ బాధ్యతలకే పరిమితం చేయాలనుకుంటున్నారు. ఇది మంచాచెడా అన్న విషయం పక్కన పెడితే కొందరి సంసారాలు సమస్యల వలయంగా మారుతున్నాయి. విడాకులు అధికం అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి ఈ సమస్య పెనుభూతంగా మారుతోంది. సమాజం నుంచి తీసుకున్న రకరకాల ఇతి వృత్తాలతో రూపొందుతున్న చిత్రాల్లో నటిస్తున్న తారలు తమ జీవితాల విషయానికి వచ్చే సరికి సర్దుబాటుతనం, పరస్పర అవగాహన, మనసు విప్పి మాట్లాడుకోవడం వంటి విషయాలను పక్కన పెడుతున్నారు.
ఇందుకు ఈగో అన్నది పెద్ద అడ్డుగోడగా మారుతుందని చెప్పవచ్చు. ప్రేమించుకునే సమయంలో, పెళ్లి అయిన కొత్తలో తన భర్త సహృదయుడు, తన భార్య అనుకూలవతి అని ఆనందంగా, ఇంకా చెప్పాలంటే గొప్పగా చెప్పుకునే వారు ఆ తరువాత కొద్ది కాలానికే కాపురాలను కలహాలమయంగా మార్చుకోవడం, విడాకుల కోసం కోర్టు గుమ్మాలెక్కడం వంటి సంఘటనలకు గురవుతుండడం బాధాకరం. ఇటీవల నటి అమలాపాల్ సంఘటననే తీసుకుంటే చిత్రరంగప్రవేశం చేసిన కొద్ది కాలానికే దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కథానాయకిగా ఎదుగుతున్న సమయంలోనే నటనకు దూరం అవుతున్నారని ఆమె అభిమానులు నిరుత్సాహానికి గురైనా, సంసార జీవితంలోకి అడుగుపెట్టినందుకు సంతోషించినవారు లేకపోలేదు. పెళ్లైన కొత్తలో విదేశాల్లో హనీమూన్, సరదాగా కాలక్షేపాలు అంటూ జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేశారు. ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. అయితే ఇలాంటి సంతోషాలకు రెండేళ్లకే కాలం చెల్లింది.
ఇప్పుడు విజయ్ అమలాపాల్ మనస్పర్థల కారణంగా విడిపోయారు. అమలాపాల్ ఇటీవల మళ్లీ నటించడం మొదలెట్టారు. ఇది విజయ్‌కి సుతారంగా ఇష్టం లేదట. ముఖ్యంగా ఆయన తల్లిదండ్రులు ఇష్టపడడం లేదట.ఈ వ్యవహారంలో కొందరు సన్నిహితుల సంధి కూడా విఫలం అయ్యిందని సమాచారం.దీంతో విజయ్ అమలాపాల్‌ల కాపురం సుఖాంతానికి తెరపడడంతో విడాకులకు సిద్ధం అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అమలాపాల్ విడాకుల వ్యవహారంపై నటి ప్రియమణి, మమతామోహన్‌దాస్, నిక్కీగల్రాణిలాంటి వారి స్పందన చూద్దాం. నటి ప్రియమణి స్పందిస్తూ ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఎంతో సాధిస్తున్నారు.వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన స్త్రీలు తమ కుటుంబాన్ని, వృత్తిని చక్కగా గమనించుకుంటున్నారు. అలాంటిది నటీమణుల విషయానికొచ్చేసరికి వివాహంతో వారి జీవితం ముగుసిపోయిందని, అభిమానుల ఆదరణ తగ్గిపోతుందనే అపోహ పరిశ్రమలో నెలకొంది.అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి మారుతోంది. వివాహనంతరం నటీమణులు సాధిస్తున్నారు. హిందీలో కరీనాకపూర్, విద్యాబాలన్ లాంటివారు వివాహానంతరం నటనలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఉత్తమ నటీమణులుగా అవార్డులు అందుకుంటున్నారు. వరుసగా నటిస్తున్నారు. తమిళంలో నటి జ్యోతిక వివాహానంతరం, ఇద్దరు పిల్లల తల్లి అయిన తరువాత కూడా మళ్లీ నటిస్తున్నారు. నటీమణులు వివాహానంతరం నటించడం తప్పేమి కాదు. నటనకు దూరం అవ్వాలన్నది పాత ఆలోచను. సమాజం పేరుతో నటీమణుల కలల్ని కల్లలు చేయడం సరికాదు అని అన్నారు.
రక్షణలేదు
నటి మమతామోహన్‌దాస్ మాట్లాడుతూ ప్రతి స్త్రీకి వివాహం అన్నది సంతోషకరమైన విషయమే.అయితే పెళ్లి అయిన తరువాత కుటుంబాన్ని చూసుకోవాలి, భర్త భాగోగులు గమనించాలంటూ పాత చింతకాయ కహానీలు చెబుతుంటారు. ఇక నటి అయితే ఈ పనులతో పాటు తన అందాన్ని కాపాడుకోవాలి. షూటింగ్‌లకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సింటుంది. భర్తలు మాత్రం భార్యకుటుంబ పనులు చూసుకోవాలి అని భావిస్తుంటారు.అవన్నీ సంతృప్తిగా చేస్తే అప్పుడు తన వృత్తికి అనుమతిస్తారు.నిజం చెప్పాలంటే నటీమణులకు రక్షణ లేదని అభిప్రాయపడుతున్నారు. నటీమణులు పెళ్లి ఆలోచనలు పక్కన పెట్టి తన పనులపై దృష్టి పెట్టాలి అని అన్నారు. స్త్రీలు అణిగిమణిగి ఉండాలని భావించేవారు కుక్కపిల్లల్ని పెంచుకోవాలని అన్నారు. నటి నిక్కీగల్రాణి మాట్లాడుతూ నటీమణులు వివాహానంతరం నటించకూడదనడం హాస్యాస్పదం అన్నారు.
వారిని కుక్కపిల్లని పెంచుకోమనండి
Published Thu, Aug 4 2016 9:55 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
Advertisement
Advertisement