టీజర్‌ చూశా.. చాలా బాగుంది – కృష్ణ | Manasuku Nachindi Movie trailer release | Sakshi
Sakshi News home page

టీజర్‌ చూశా.. చాలా బాగుంది – కృష్ణ

Dec 13 2017 12:26 AM | Updated on Sep 15 2019 12:38 PM

Manasuku Nachindi Movie trailer release - Sakshi

‘‘కిరణ్‌గారు మంచి మంచి సినిమాలు చేశారు. ఆ బ్యానర్‌తో కలిసి ఇందిర ప్రొడక్షన్‌ సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. మంజుల కథ, డైలాగ్స్‌ కూడా రాసుకుని డైరెక్షన్‌ చేస్తుందని నాకు తెలియదు. ఈ సినిమా కథ నాకు తెలియదు. అయితే, ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ చాలా బాగుంది. కచ్చితంగా సినిమా సూపర్‌హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని సూపర్‌స్టార్‌ కృష్ణ అన్నారు. సందీప్‌ కిషన్, అమైరా దస్తుర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా ఘట్టమనేని మంజుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మనసుకు నచ్చింది’. ఆనంది ఇందిరా ప్రొడక్షన్‌ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్‌పై సంజయ్‌ స్వరూప్, పి.కిరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ని కృష్ణ, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని దర్శకుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘మంజుల నా దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసి, ఆ తర్వాత డైరెక్షన్‌ చేస్తానని చెప్పింది.

ఓరోజు సడన్‌గా వచ్చి డైరెక్షన్‌ చేస్తున్నాను అంది. అదేంటి? నా అసిస్టెంట్‌గా చేస్తానన్నావు కదా? అని అడిగితే.. ‘నేను మీ ఏకలవ్య శిష్యురాల్ని.. మీ సినిమాలు చూసి తెలుసుకున్నాను’ అంది. నాకు గురుదక్షిణగా రెండు పాటలు చూపించింది. చాలా బాగున్నాయి’’ అన్నారు. ‘‘నాన్నలా పేరు రావాలంటే సినిమాలే మార్గమని ఈ రంగంలోకి అడుగుపెట్టా. సినిమాల్లో నటించడంతో పాటు నిర్మించాను. ఇంకా ఏదో చేయాలనిపించి దర్శకత్వం చేశా’’ అన్నారు మంజుల. ‘‘స్వీట్‌ అండ్‌ సింపుల్‌ హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ఇది. ఎప్పటి నుంచో ఇలాంటి లవ్‌స్టోరీ చేయాలనుకున్నా. ఇప్పటికి కుదిరింది. నాకు అక్కయ్య లేని లోటును మంజులగారు తీర్చారు’’ అన్నారు సందీప్‌కిషన్‌. ‘‘ఫస్ట్‌ కాపీ రెడీ అయ్యింది. సినిమా బాగా వచ్చింది. జనవరి 26న విడుదల చేస్తున్నాం’’ అన్నారు సంజయ్‌ స్వరూప్, పి.కిరణ్‌. మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా, నటులు ప్రియదర్శి, పునర్నవి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్, కెమెరా: రవియాదవ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement