
ఆచారి అండ్ కో అమెరికా యాత్ర ముగిసింది... ప్రస్తుతానికి! అందరూ హైదరాబాద్ వచ్చేశారు. మళ్లీ వెళతారేమో కానీ... మొన్నటి యాత్రలో అయితే బోలెడు నవ్వుల్ని బంధించి మోసుకొచ్చారట! ఇంతకీ, ఆచారి ఎవరో తెలుసుగా? మంచు విష్ణు. ఆయన హీరోగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తీ చౌదరి, కిట్టు నిర్మిస్తున్న సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’.
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. బ్రహ్మానందం ప్రధాన పాత్రధారి. ఎమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పకులు. ఇటీవలే అమెరికా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రబృందం హైదరాబాద్ చేరుకుంది. ‘‘అమెరికాలో కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలు చిత్రీకరించాం. విష్ణు, బ్రహ్మానందం కలయికలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి’’ అన్నారు దర్శకుడు.
‘‘నాగేశ్వరరెడ్డి స్టైల్‌లో సాగే కామెడీ ఎంటర్‌టైనర్ ఈ ‘ఆచారి అమెరికా యాత్ర’. కుటుంబంతో చూసి, ఆనందించదగ్గ చిత్రమిది’’ అన్నారు నిర్మాతలు. తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, ఎల్బీ శ్రీరామ్, పోసాని నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ‘డార్లింగ్’ స్వామి, పాటలు: భాస్కరభట్ల, స్క్రీన్‌ప్లే: విక్రమ్‌రాజ్–నివాస్–వర్మ, సంగీతం: ఎస్.ఎస్. తమన్.
Comments
Please login to add a commentAdd a comment