చెర్రీ, బన్నీలతో నటించాలని ఉంది
బీకామ్ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యింది. కామ్‌గా సీఏ చేద్దామనుకుంది. కానీ, కుదర్లేదు. సినిమాల్లో అవకాశం వచ్చింది. ఓసారి ప్రయత్నిస్తే పోలా అనుకుంది.
బీకామ్ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యింది. కామ్‌గా సీఏ చేద్దామనుకుంది. కానీ, కుదర్లేదు. సినిమాల్లో అవకాశం వచ్చింది. ఓసారి ప్రయత్నిస్తే పోలా అనుకుంది. ‘వళక్కు ఎన్ 18/9’ చిత్రం ద్వారా హీరోయిన్ అయ్యింది. ఇంతకీ తన పేరు చెప్పనేలేదు కదూ. మనీషా యాదవ్. ‘తూనీగ తూనీగ’ చిత్రంతో తొలిసారి తెలుగు తెరపై కనిపించిన మనీషా ‘ప్రేమించాలి’తో తనకు తెలుగులో బ్రహ్మాండమైన బ్రేక్ వస్తుందని ఆశిస్తోంది. ఎస్‌కే పిక్చర్స్ ద్వారా సురేష్ కొండేటి విడుదల చేస్తోన్న పదో చిత్రం ఇది.
ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా మనీషా మాట్లాడుతూ - ‘‘టీనేజ్‌లో ప్రేమలో పడిన ఓ యువతీ యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది. మానసిక పరిపక్వత లేని వారి ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది? అనేది ప్రధానాంశం. యువతీయువకుల ఆలోచనా ధోరణిలో మార్పు తెచ్చే చిత్రం అవుతుంది. ఇందులో నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశాను’’ అని చెప్పారు. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నానని, తెలుగులో కూడా సినిమాలు చేయాలని ఉందని మనీషా తెలిపింది. రామ్‌చరణ్, అల్లు అర్జున్ సరసన అవకాశం వస్తే చేస్తానని, చిరంజీవికి పెద్ద అభిమానినని చెప్పింది మనీషా.