
సినిమాల్లో మన హీరోయిన్లు తాళి కట్టించుకుంటుంటారు.. ఉత్తుత్తిగా! ఇప్పుడు తాళి కట్టించుకుంటున్నారు... బహు తృప్తిగా! మిసెస్‌లమైనా సినిమాలు మిస్ కొట్టం అని చెబుతున్నారు. మరి.. మీరూ కొట్టండి తాలి. అంటే.. అంటే చప్పట్లు.
‘పై లోకంలో వాడు ఎప్పుడో ముడి వేసేశాడు’... స్క్రీన్ మీద నాగచైతన్య, సమంత హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్న సమయంలో వచ్చే పాట. వినడానికి బాగుంటుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కోరుకున్న ఆడియన్స్ మనసు కూడా మురిసిపోతుంది. ఓ ప్రేమ జంట పెళ్లితో తమ బంధాన్ని ముడి పెట్టుకున్నందుకు ఆనందంగా థియేటర్ నుంచి బయటికొచ్చేస్తాం. సినిమా పెళ్లిళ్లను ఎంజాయ్ చేస్తాం. కానీ రియల్‌గా ఆ స్టార్స్.. ముఖ్యంగా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారంటే చిట్టి గుండెని చిన్నగా గిచ్చినట్లుగా బాధపడిపోతుంటారు కొందరు. ఎందుకంటే పెళ్లి తర్వాత ఆ హీరోయిన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తుందేమోనని కంగారు.
ఒకవేళ తను కంటిన్యూ అవ్వాలనుకున్నా అవకాశాలు వస్తాయో రావోనని టెన్షన్. ఒకవైపు అభిమాన కథానాయిక పెళ్లి చేసుకుంటున్నందుకు ఆనందపడినా, స్క్రీన్‌కి దూరం అవుతుందేమోననే భయం ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో చాలామంది అభిమానులకు ఆ భయం పట్టుకుంది. మరి.. ప్రేమించినవాళ్లు ప్రేమించినట్లు పెళ్లి చేసేసుకుంటున్నారు! మొన్న అనుష్కా శర్మ– విరాట్ కోహ్లీ, ఆ తర్వాత సోనమ్ కపూర్–ఆనంద్ అహూజా ఒకింటివారయ్యారు. మరో రెండు మూడు జంటలు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఈ మిస్సులందరూ మిసెస్‌లయ్యి, సిల్వర్ స్క్రీన్‌ని మిస్సవుతారనే టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ‘డోంట్ వర్రీ.. మేం సినిమాలను వదలం’ అని హామీ ఇస్తున్నారు. ఇక.. పెళ్లి చేసుకోబోయే జంటల గురించి చెప్పుకుందాం.
ప్రిక్
బాలీవుడ్‌లో ఓ ట్రెండ్ ఉంది. ఏదైనా ప్రేమ జంట పెళ్లి చేసుకుంటున్నారంటే.. వాళ్లిద్దరి పేర్లను కలిపి ఒక పేరుగా పిలుచుకుంటారు. ఉదాహరణకు సైఫ్ అలీఖాన్–కరీనా కపూర్‌లను ‘సైఫీనా’ అని పిలవడం మొదలుపెట్టారు. అలాగే అనుష్కా శర్మ–విరాట్ కోహ్లీని ‘విరుష్కా’ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఓ జంటను ‘ప్రిక్’ అని పిలుస్తున్నారు. ఆ పేరుకి అర్థం ‘గుచ్చుకోవడం’. ఇదేం పేరబ్బా అనుకోకండి. ప్రియాంకా చోప్రా–నిక్ జోనస్‌ల పేర్లను ‘ప్రిక్’ అంటూ ఒక పేరుగా చేశారు.
అంటే.. గుచ్చుకోవడమే కదా. ప్రేమలో ఉన్న ఆ ఇద్దరూ ఆనందంగా ఉన్నా హాలీవుడ్‌కి వెళ్లాక హిందీ సినిమాలు తగ్గించేసి, ఇప్పుడు పెళ్లికి రెడీ అయి అభిమానుల గుండెల్లో ప్రియాంక ఎప్పుడో ముల్లు గుచ్చేశారు. నిజానికి హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్–మన దేశీ భామ ప్రేమలో పడి ఏడాది కూడా అవ్వలేదు. పైగా ప్రియాంక కన్నా నిక్ పదేళ్లు చిన్నవాడు. అయినా ప్రేమ ముందు వయసు అంకెలు కనబడలేదు.
తక్కువ పరిచయంలోనే ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఎక్కువగా అర్థం చేసుకున్నట్లున్నారు. ఏడడుగులు వేయడానికి రెడీ అయిపోయారు. అసలే హిందీ సినిమాలు తగ్గించేసిన ప్రియాంక పెళ్లి తర్వాత నిక్‌తో యూఎస్‌లో సెటిలై, ఇక్కడి సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా? ఇప్పట్లో ఆ చాన్స్ లేదు. ఎందుకంటే హిందీలో ఆమె ‘ది స్కై ఈజ్ పింక్’ అనే సినిమాతో పాటు మన ప్రాంతీయ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మిస్తున్నారు. అలాగే, ఇప్పట్లో పెళ్లి లేదట.
రణ్‌దీప్
ప్రశ్న ఒకటి.. సమాధానం కూడా ఒకటే. ఆప్షన్స్ నాలుగు ఉంటాయి. సరైన సమాధానం ఎంచుకోండి. ఏంటీ? స్కూల్ డేస్‌లో రాసిన పరీక్షలు గుర్తొస్తున్నాయా? లేక ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గుర్తొస్తోందా? ఇప్పుడీ విషయం ఎందుకంటే హిందీ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ ముందు ఓ ప్రశ్న ఉంచి, ‘ఒప్పుకుంటారా? కాదంటారా?’ అనడిగితే ‘కాదనను’ అన్నారట. ఆ ప్రశ్న ఏంటంటే.. ‘దీపికా–రణ్‌వీర్ సింగ్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారట. ఒప్పుకుంటారా? కాదంటారా?’. కరణ్ చెప్పిన సమాధానంతో ఈ ఇద్దరి పెళ్లి ఖరారు అని చాలామంది ఫిక్స్ అయ్యారు. నవంబర్‌లో జరగబోయే ఈ వేడుకకు సంబంధించిన పనులు రెండు కుటుంబాల్లోనూ మొదలయ్యాయట.
ఇటలీలోని లేక్ కోమోలో ఈ వేడుకను ప్లాన్ చేసుకున్నారట. ఇక్కడివాళ్ల కోసం ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇటీవల బెంగళూరులోని దీపిక స్వగృహంలో ప్రత్యేక పూజ ఏదో జరిగిందని టాక్. అన్నట్లు ముంబైలోని బాంద్రాలో తాను ఉంటున్న ఇంటిని సర్వాంగ సుందరంగా తయారు చేయిస్తున్నాడట రణ్‌వీర్. ఆ ఇంటి పనులు ఎలా జరుగుతున్నాయో ఇటీవల దీపిక వెళ్లి చూడటం కొందరి కళ్లల్లో పడింది. ఇంకేం కల్యాణం కరెక్టే అనుకుంటున్నారు. అన్నట్లు ఈ ఇద్దరికీ పెట్టిన పేరు ‘రణ్‌దీప్’ అట.
రణ్‌బీరాలియా
ప్రేమ ఎప్పుడు పుట్టునో ఎవరికీ తెలియదు. పుట్టిన ప్రేమ పది మందికీ తెలియకుండా దాగదు. రణ్‌బీర్ కపూర్–ఆలియా భట్‌ల ప్రేమ కహానీ కూడా చాలా త్వరగా బయటికొచ్చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాతే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ జంట జంటగా నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ మొదలైంది ఆ నెలలోనే. ఇద్దరూ కలసి నటిస్తున్న తొలి చిత్రం. సినిమా షూటింగ్ రోజులు పరిగెడుతున్నాయి. ఇద్దరి మనసులూ ప్రేమ వైపు పరుగులు పెట్టాయి. ‘అవునూ.. ఆలియా, మీరు లవ్‌లో ఉన్నారట?’ అని ఆ మధ్య ఎవరో రణ్‌బీర్‌ని అడిగితే – ‘కొత్తగా మొదలైన ఏ రిలేషన్‌షిప్ గురించైనా అప్పుడే ఏం మాట్లాడతాం’ అన్నాడు.
వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని చెప్పడానికి ఇది చాలదా? పైగా.. ఆ మధ్య రణ్‌బీర్ తల్లి నీతూని ఆలియా ఓ రెస్టారెంట్‌లో కలవడం, ఇద్దరూ చాలా ఆప్యాయంగా మాట్లాడుకోవడం చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఈ విందులో రణ్‌బీర్ సిస్టర్స్ రిధిమా కపూర్, షానీ కూడా పాల్గొన్నారు. వీళ్లతో ఆలియా కెమిస్ట్రీ ఓ ప్రత్యేకమైన బంధాన్ని సూచించింది అని చూపరులు అంటున్నారు. ఆ తర్వాత రణ్‌బీర్ తండ్రి రిషీ కపూర్‌ని కూడా ఆలియా కలిశారట. విశేషం ఏంటంటే.. ఈ జంటకు పెద్దలవైపు నుంచి ఎలాంటి ఆటంకాలు లేవు. రెండూ పేరున్న కుటుంబాలే. ఒకటి కపూర్ ఫ్యామిలీ.. ఇంకోటి భట్ ఫ్యామిలీ.
‘మీ అమ్మాయి డేటింగ్ విషయం మీకు తెలుసా?’ అని ఇటీవల మహేశ్ భట్‌ని ఓ విలేకరి అడిగితే – ‘‘చెప్పాలనుకుంటే చెబుతుంది. మా ఇంట్లో ఎవరి స్వేచ్ఛ వారికుంటుంది. అయినా తనేం చిన్నమ్మాయి కాదు’’ అన్నారట. రణ్‌బీర్‌ని అల్లుడిగా చేసుకోవడానికి మహేశ్ భట్ కుటుంబం రెడీగా ఉందని టాక్. అయితే 2020లో పెళ్లి చేసుకోవాలని రణ్‌బీరాలియా (ఈ ఇద్దరికీ బీ టౌన్ పెట్టిన పేరు) అనుకుంటున్నారట. అంత గ్యాప్ అంటే.. ఇప్పుడున్న ప్రేమ ఇలానే ఉంటుందా? లేక దీపికా పదుకోన్‌తో లవ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టి, కత్రినా కైఫ్‌తో కటీఫ్ చెప్పినట్లు ఆలియాకి కూడా రణ్‌బీర్ హ్యాండిస్తాడా? లేక ఆలియా ఆ పని చేసే అవకాశం ఉందా? కాలమే చెప్పాలి.
అదండీ సంగతి... రానున్న రోజుల్లో బాలీవుడ్‌లో వరుసగా పెళ్లిళ్లు జరగబోతున్నాయి. అభిమానులూ గుండె దిటవు చేసుకోండి. మీ స్టార్లు ఎక్కడికీ పోరని ముందే చెప్పాం కదా. సినిమాలు చేస్తారు. ఆ సంగతలా ఉంచితే.. వీళ్ల పెళ్లిళ్ల వల్ల డిజైనర్లకు, మేకప్ ఆర్టిస్ట్‌లకు, హెయిర్ స్టైలిస్టులకూ చేతుల నిండా పని. విందు గురించి మరచిపోతే ఎలా? భలే పసందుగా ఉంటుంది. తిన్నాక ‘కైకే పాను బనారసు వాలా’ అంటూ కిళ్లీ వేసుకోకుండా ఉండరు.
ఏదో ఉంది!
‘అబ్బే అలాంటిదేమీ లేదు’ అంటున్నారు కానీ ఇద్దరి వాటం చూస్తుంటే ‘ఏదో ఉంది’ అన్నట్లే ఉంది. టైగర్ ష్రాఫ్–దిశా పాట్నీ గురించి చెబుతున్నాం. ‘భాగీ –2’లో జతకట్టిన ఈ జంట ఆ సినిమా సెట్స్‌లోనే ప్రేమలో పడ్డారని బీ టౌన్ కోడై కూస్తోంది. లంచ్‌లు, డిన్నర్లకు రెస్టారెంట్లకు వెళ్లిన ఈ ఇద్దరూ చాలామంది కంట్లో పడ్డారు.
పైగా టైగర్ తల్లి అయేషాతో దిశా ఓ రెస్టారెంట్‌లో విందు లాగిస్తూ చాలా కళ్లకు చిక్కింది. ఆ తర్వాత టైగర్ సోదరి కృష్ణా ష్రాఫ్‌తో సరదాగా దిశా దిగిన ఓ ఫొటో కూడా బయటికొచ్చింది. దాంతో అబ్బాయి ఇంటి నుంచి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నది చాలామంది నమ్మకం. మరి.. తమ బంధాన్ని ఈ ఇద్దరూ బాహాటంగా ఎప్పుడు చెబుతారో చూడాలి.
ఇల్లూ బేబీ.. ఏంటి సంగతి?
‘మా హబ్బీ ఈ ఫొటో తీశారు’ అని ఏ అమ్మాయి అయినా అంటే.. అది భర్త తీసిన ఫొటోనే అని అర్థమైపోతుంది. ఆ మధ్య ఇలియానా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్ ఒకటి చేశారు. ఆ హబ్బీ ఎవరంటే.. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్. మూడు నాలుగేళ్లుగా ఈ ఇద్దరూ లవ్‌లో ఉన్నారు.
ఆండ్రూతో మీ రిలేషన్‌షిప్ ఎలాంటిది? అని ఇల్లూ బేబీని అడిగితే– ‘‘ఆయన స్పెషల్ పర్సన్’’ అంటుంది. లవ్‌ని కన్‌ఫార్మ్ చేయలేదు. ‘ఈ మధ్య నా లైఫ్ చాలా బాగుంది’ అని మాత్రం చెబుతూ వస్తోంది. దానికి కారణం అంటే ‘ఇంకెవరూ.. ఆండ్రూనే’ అంటోంది కానీ పెళ్లి చేసుకున్నాం అని మాత్రం అనడంలేదు. ‘హబ్బీ’ అని అంది కాబట్టి, సైలెంట్‌గా పెళ్లాడారని అర్థమవుతోంది. మరి.. ఇల్లూ బేబీ.. ఏంటి సంగతి? అసలు విషయం చెబితే ఔత్సాహికరాయుళ్లు ఆనందపడతారు కదా?
చాలా స్పెషల్ అండీ..
డెన్మార్క్‌కు చెందిన మథియాస్ బోతో తాప్సీ ప్రేమలో ఉన్నారని మూడు నాలుగేళ్లుగా వినిపిస్తున్న వార్త. మథియాస్ మంచి ఆటగాడు. ఒలింపిక్స్‌లో మెడల్ కూడా గెలుచుకున్నాడు. ఓ సందర్భంలో తాప్సీ, మథియాస్ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసిందట.
ఇతగాడి ఆట ఉంటే.. తాప్సీ స్టేడియమ్ గ్యాలరీలో కనిపిస్తారనడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మథియాస్‌తో మీ రిలేషన్ అంటే.. ఇలియానాలానే తాప్సీ కూడా ‘అతను వెరీ స్పెషల్’ అంటుంది. అసలు ఈ స్పెషల్ స్టేటస్‌కి అర్థం ఏంటో? ఆ సంగతి పక్కన పెడితే ఈ ఇద్దరూ ఆ మధ్య ముంబైలో ఓ రెస్టారెంట్ నుంచి బయటికొస్తూ మీడియా కంటికి చిక్కారు. మరి.. ఇద్దరి మధ్యా ఏమీ లేదంటారా?
– డి.జి. భవాని