‘అల్లరి’ నరేశ్‌ను కొత్తగా చూపించాం : మోహనకృష్ణ ఇంద్రగంటి
సున్నితమైన కథాంశాలతో మానవీయ అనుబంధాలకు పెద్దపీట వేస్తూ సినిమాలు తెరకెక్కించే ఓ దర్శకుడు.... మోహనకృష్ణ ఇంద్రగంటి. తీసింది తక్కువ సినిమాలే అయినా... అభిరుచి గల దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొన్నారు. ‘అష్టా చమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘అంతకుముందు... ఆ తరువాత’ చిత్రాలతో విజయాలు సొంతం చేసుకొన్నారు. స్వచ్ఛమైన వినోదంతో సినిమాలు తీస్తారనే పేరున్న ఇంద్రగంటి తాజాగా ‘అల్లరి’ నరేశ్‌తో ‘బందిపోటు’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈవీవీ సినిమా పతాకంపై రాజేశ్ ఈదర నిర్మించిన ఆ చిత్రం ఇటీవలే విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ సందర్భంగా మోహనకృష్ణ ఇంద్రగంటి ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలివీ....
‘‘అల్లరి నరేశ్‌తో ఓ సినిమా చేయాలని మూడేళ్ళక్రితమే నిర్ణయించుకొన్నా.
అయితే ఆ చిత్రం ఇటు నాకు, అటు నరేశ్‌కీ ఇద్దరికీ కొత్తగా ఉండాలనుకొన్నాం. ఆ ఆలోచనల మేరకే ‘బందిపోటు’ కథను తయారు చేసుకొన్నా. ఇప్పటిదాకా నేను ఇలాంటి కోవలోని సినిమా చేయలేదు. ‘అల్లరి’ నరేశ్‌కి కూడా ఇది కొత్త కథ. ఆయన దాదాపుగా ప్రతీ సినిమాలోనూ స్పూఫ్‌లు చేస్తూ వినోదం పండిస్తుంటారు. అలా కాకుండా కథలోని సన్నివేశాలతోనే వినోదం పండించేలా స్క్రిప్టును తీర్చిదిద్దా. ఈ సినిమాతో నరేశ్ బాడీ లాంగ్వేజ్‌ని కూడా మార్చాలనుకొన్నాం. తెరపై ఎప్పట్లా హైపర్ యాక్టివ్‌గా కాకుండా కాస్త నింపాదిగా, కూల్‌గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకొన్నాం. మా ప్రయత్నాలన్నీ మంచి ఫలితాల్ని తీసుకొచ్చాయి. ‘అల్లరి’ నరేశ్‌ని కొత్తగా చూపించారనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచీ వ్యక్తమవుతోంది.’’
ఆ ప్రభావం చాలా ఉంది!
‘‘దొంగల్ని దోచుకొనే బందిపోటుగా నరేశ్‌ని చూపించా. ఇందులో ఆయన నిజమైన హీరోగా కనిపిం చాడు. డ్రామా పండించడంలో, సన్నివేశాలకు అను గుణంగా వినోదం పండించడంలో ఆయన తన మార్కును చూపించారు. ఇలాంటి ఒక కథతో చిత్రాన్ని చేయాలనే ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. ‘ద స్టింగ్’, ‘హైస్ట్’, ‘మాచ్‌స్టిక్ మెన్’ తదితర ఆంగ్ల చిత్రాలకు నేను పెద్ద అభిమానిని. రేమండ్ చాండ్లర్, ఎడ్జర్ వాలెస్ తదితర రచయిత నవలల ప్రభావం కూడా నాపై ఎంతో ఉంది. వాళ్లకు ఓ నివాళిలా ఈ చిత్రం తీశా. కథలోని డ్రామా, వినోదం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకొంటోంది. ‘అల్లరి’ నరేశ్‌తో పాటు సంపూర్ణేశ్‌బాబు, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రలతో రక్తి కట్టించారు. భారీ తారాగణంతో తీసిన ఈ చిత్రం దర్శకుడిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.’’
గర్వంగా ఉంది..!
‘‘ఈవీవీ సినిమా సంస్థలో సినిమా చేయడం గర్వకారణంగా భావిస్తుంటా. తండ్రి స్థాపించిన నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న చిత్రం కాబట్టి ఆర్యన్ రాజేశ్, ‘అల్లరి’ నరేశ్‌లు ఇద్దరూ కూడా నిర్మాణ విలువలకు ప్రాధాన్యమిస్తూ ఈ సినిమాను తీశారు. ప్రమోషన్ విషయంలోనూ వాళ్లు చూపిన శ్రద్ధ చూసి, చాలా ఆనందమేసింది. ఈ సినిమా మరింతమంది ప్రేక్షకులకు చేరువవుతుందన్న నమ్మకం నాకుంది. ఇలాగే ఎప్పటికప్పుడు కొత్త జానర్లలో సినిమాలు చేస్తూ ప్రయాణం చేయాలన్నదే నా ముందున్న లక్ష్యం.’’