అమ్మ పెట్టకపోతే పిన్ని ఇంటికి వెళ్లాలి! | Movie artists anchoring to tv shows | Sakshi
Sakshi News home page

బుల్లితెర పాత్రల్లో టీవించేశారు

Published Tue, Oct 23 2018 12:02 AM | Last Updated on Tue, Oct 23 2018 12:21 PM

Movie artists anchoring to tv shows - Sakshi

‘అమ్మ పెట్టకపోతే పిన్ని ఇంటికి వెళ్లమని’ సామెత. తల్లి వంట గదిలో పొయ్యి వెలిగించకపోతే పినతల్లి ఇంటికైనా వెళ్లి కడుపు నింపుకోవాలి కదా. ఇక్కడ తల్లి పెద్ద తెర అయితే పినతల్లి బుల్లి తెర. ఒకప్పుడు టీవీలో పని చేయడం తక్కువగా చూడబడేది. టీవీని ద్వితీయశ్రేణి మీడియాగా భావించబడేది. ఇవాళ టీవీ దాదాపు సినిమాకు పార్లల్‌ మీడియాగా ఉంది. కోట్లాది ఇళ్లలో టీవీని ఆన్‌ చేయకుండా రోజు గడవదు. పాపులర్‌ సీరియల్స్, గేమ్‌ షోస్, టాక్‌ షోస్, డాన్స్‌ షోస్‌... ఇవన్నీ లాభదాయకమైన షోస్‌గా కాసులు కురిపిస్తున్నాయి కూడా. ఇంకా చెప్పాలంటే గతంలో సినిమా రంగంలో అవకాశాలు తగ్గినవారు టీవీ రంగంలో ఉపాధి పొందేవారు. కానీ ఇప్పుడు సినిమా రంగంలోనూ టీవీ రంగంలోనూ రాణించాలని చూస్తున్నారు. పై సామెతను తిరగేస్తే అమ్మ దగ్గర రెండు ముద్దలు పిన్ని దగ్గర రెండు ముద్దలు సొమ్ము చేసుకుందామని చూస్తున్నారు.బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్, సల్మాన్‌ఖాన్, షారుక్‌ ఖాన్, ఆమిర్‌ ఖాన్‌... వీరందరూ టీవీ షోలు చేసినవారే. కుంగిపోయి ఉన్న తన కెరీర్‌ను అమితాబ్‌ బచ్చన్‌ టీవీలోని ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ షో ద్వారానే పునరుద్ధరించుకున్నాడు. ఆమిర్‌ చేసిన ‘సత్యమేవ జయతే’ షో చాలా పెద్ద హిట్‌ అయ్యింది. ఇక సల్మాన్‌ ఖాన్‌ బిగ్‌ బాస్‌ షో ద్వారా కొనసాగుతూనే ఉన్నాడు. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, జగపతిబాబు, జయప్రద షోలు చేశారు. ఎప్పుడూ మాట్లాడని దర్శకుడు కె.రాఘవేంద్ర రావు తన పేరు మీద తయారైన షోలలో పాల్గొన్నారు. ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, నాగూర్‌బాబు(మనో), సునీత... తదితరులు సంగీతానికి సంబంధించిన షోలు చేస్తున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్నా బుల్లి తెర మీద షోను సక్సెస్‌ చేసుకున్న మరో నటుడు ఆలీ. ఈ నేపథ్యంలో 2018 సంవత్సరం కూడా కొంతమంది సినిమా పర్సనాల్టీలను టీవీకి  పరిచయం చేసింది. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేలా చేసింది. వారి వివరాలు....

నా..నీ టీవీలో చూసేయండి
వరుస విజయాలతో కెరీర్‌లో దూసుకెళ్తున్న హీరో నాని ఈ ఏడాది టెలివిజన్‌లోకి అడుగుపెట్టారు.  సూపర్‌ హిట్‌ షో ‘బిగ్‌ బాస్‌’ ద్వారా ఇంటింటా బొమ్మ కట్టారు. నిజానికి బిగ్‌బాస్‌ సీజన్‌ వన్‌ హోస్ట్‌గా ఎన్‌.టి.ఆర్‌ మార్కులు కొట్టేశారు. కానీ ‘అరవింద సమేత వీర రాఘవ’ షూటింగ్‌ బిజీతో బిగ్‌బాస్‌ సెకండ్‌ సీజన్‌కు వ్యాఖ్యాతగా చేయడం కుదరకపోవడంతో ఆయన ప్లేస్‌లోకి నాని వచ్చారు. తనదైన స్టైల్లో ఆయన షోని మోశారు. మొదట్లో కొన్ని భిన్నాభిప్రాయాలు వినిపించినా ఎపిసోడ్స్‌ ముందుకు వెళ్లే కొద్దీ అందర్నీ ‘నా నీ’ టీవీలకు కట్టిపడేశారు నాని.  అయితే థర్డ్‌ సీజన్‌కు యాంకర్‌గా కొనసాగబోనని సెకండ్‌ సీజన్‌ ఫైనల్‌ రోజే అనౌన్స్‌ చేశాడాయన. ప్రస్తుతానికైతే ఖాళీ లేదు... భవిష్యత్తులో ప్రేక్షకులను అలరించే కార్యక్రమాలు ఎప్పుడు తన దారిలో వచ్చినా టీవీలో మెరవడానికి రెడీ అన్నాడాయన. 



నవ్వుతారు

దశాబ్దాలుగా వెండి తెర మీద నవ్వులు పూయిస్తున్నారు బ్రహ్మానందం. ఆయన స్క్రీన్‌ మీద కనిపిస్తే హాస్య గ్రం«థులకు పని పెరుగుతుంది. ఇప్పుడు తొలిసారి బుల్లితెర మీద కూడా కామెడీ షో ద్వారానే ఎంట్రీ ఇచ్చారు. స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న ‘ది గ్రేట్‌ ఇండియా లాఫ్టర్‌ చాలెంజ్‌’ పేరుతో స్టాండప్‌ కామెడీ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారాయన. ఏదైనా టాపిక్‌ ఎంచుకొని దాంతో హాస్యం పుట్టించగలగడమే స్టాండప్‌ కామెడీ. మిమిక్రీ కళకు ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది. హాస్యానికి సంబంధించిన షో కాబట్టి వెంటనే చేయాలనిపించింది అని ఈ షో గురించి పేర్కొన్నారు బ్రహ్మానందం. 



వినోదంతో పాటు విరాళమూ

నటుడిగా, నిర్మాతగా, తమిళ నటుల సంఘానికి ప్రెసిడెంట్‌గా పూర్తి బిజీగా ఉన్నప్పటికీ టెలివిజన్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అన్నారు విశాల్‌. అయితే విశాల్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నది  కేవలం టాక్‌ షో మాత్రమే కాదు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే చారిటీ షో కూడా . ‘నామ్‌ ఒరువర్‌’ అనే పేరుతో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం తెలుగులో మంచు లక్ష్మి చేస్తోన్న ‘మేము సైతం’ స్టైల్లోనే సాగుతోంది. సెలిబ్రిటీలతో కొంచెం సేపు చిట్‌చాట్‌ చేయించి కష్టాల్లో ఉన్న వాళ్ల కోసం చారిటీగా ఏదైనా కార్యక్రమం చేసి ఫండ్స్‌ సేకరిస్తారు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే కాకుండా కొంచెం సామాజిక స్పృహ ఉన్న షోతో ఎంట్రీ బావుంటుందని ఈ షో ద్వారా ఎంట్రీ ఇస్తున్నానని విశాల్‌ పేర్కొన్నారు.
 

స్వప్న సుందరి కోసం...
‘స్వప్న సుందరి’ అనే రియాలిటీ షో ద్వారా హోస్ట్‌గా మారారు తమిళ నటుడు ప్రసన్న. ఈయన నటి స్నేహ భర్త. సాయిధరమ్‌ తేజ్‌ ‘జవాన్‌’లో విలన్‌గా నటించారు. అమెరికన్‌ హిట్‌ షో ‘నెక్ట్స్‌ టాప్‌ మోడల్‌’ కాన్సెప్ట్‌తో ఈ స్వప్న సుందరి షోను రూపొందించారు. తమిళనాడు నెక్ట్స్‌ ‘సూపర్‌ మోడల్‌’ ఎవరు? అనేది ఈ షో కాన్సెప్ట్‌. కాంటెస్ట్‌లో పాల్గొని గెలిచిన విజేతను స్వప్న సుందరిగా ప్రకటిస్తారు. ఈ ప్రోగ్రామ్‌ ఈ నెలలోనే స్టార్ట్‌ అయింది.
 

ప్రశ్నించడం ఆపేద్దాం
విశాల్‌ బాటలోనే వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కూడా సామాజిక కోణం ఉన్న షో ద్వారానే టీవీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ఉన్నై అరిందాల్‌’ అనే షో ద్వారా సొసైటీలో ఉన్న సమస్యలను డిస్కస్‌ చేయదలిచారు. అలాగే ప్రేక్షకులు తమని తాము ప్రశ్నించుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతోందని పేర్కొన్నారామె. ఎవరెవరు ఏమేం చేశారు? అని ప్రశ్నించడం ఆపేద్దాం. మనం ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ బుల్లి తెరపై సందడి చేస్తున్నారు. జయ టీవీలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతోంది. సినిమాల పరంగానూ ఈ ఏడాది వరలక్ష్మీ డైరీ ప్రతి పేజ్‌ మంచి సక్సెస్‌ను రాసిపెట్టుకుంది. ఆల్రెడీ నాలుగు రిలీజ్‌లు ఉన్న ఈ తార  ఇప్పుడు ఇంకో రెండు రిలీజ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. 

మా ఇంటి అల్లుడు
ఆర్య.. తమిళంలో రొమాంటిక్‌ హీరో. అదే కాన్సెప్ట్‌తో ‘ఎంగ వీట్టు మాప్పిళ్లై’ (మా ఇంటి అల్లుడు) అనే షో రూపొందించారు. ఆర్య పెళ్లి కొడుకుగా అతని పరిణయం కోసం కొందరు కంటెస్టంట్స్‌ పాల్గొని,  ఫైనల్‌ రౌండ్‌ వరకూ నిలిచిన వారిని ఆర్య వివాహం చేసుకుంటాడు అన్నది ఈ షో కాన్సెప్ట్‌. ప్రస్తుతం తెలుగులో వస్తున్న ‘ప్రదీప్‌ పెళ్లి చూపులు’ తరహాలోనే ఈ కార్యక్రమం ఉంది. కానీ విశేషమేంటంటే షో ఆఖర్లో షో ఫైనలిస్ట్‌ని పెళ్లి చేసుకోబోవడం లేదని ఆర్య షాక్‌ కూడా ఇచ్చారు.

సింగర్‌గా, నటిగా, మ్యూజిక్‌ కంపోజర్‌గా ఇప్పటికే బాక్స్‌లకు టిక్‌ పెట్టారు  శ్రుతీహాసన్‌. ఇప్పుడు టెలివిజన్‌ హోస్ట్‌ అన్న బాక్స్‌కు కూడా టిక్‌ పెట్టడానికి రెడీ అయ్యారు. తండ్రి కమల్‌హాసన్‌ బాటలోనే టీవీ ఆడియన్స్‌ను అలరించడానికి సన్నద్ధమయ్యారు ఈ నటి.  సన్‌ టీవీలో ప్రసారం కాబోయే ‘హలో సాగో’ అనే షోకు హోస్ట్‌గా కనిపిస్తారు. ఈ విషయాన్ని  ఇటీవలే తెలిపారు శ్రుతీ. కొత్త సినిమాలేవీ సైన్‌ చేయని శ్రుతీ ప్రస్తుతం మ్యూజిక్‌ కెరీర్‌ మీద దృష్టి పెట్టారు. ఈ షో ఎలా ఉంటుందో అన్న డీటైల్స్‌ మాత్రం తెలియాల్సి ఉంది. 

హీరోయిన్లు సైతం
చిన్న తెర మీద పెద్ద హీరోలతో పాటు పెద్ద హీరోయిన్లు కూడా తమ ప్రతిభ చాటుతున్నారు.  జయసుధ, మంచు లక్ష్మీ, జీవిత, సుమలత, రోజా, ఆమని, రంభ, స్నేహ వంటి తారలు  చిన్ని తెరకు ప్రాధాన్యం ఇచ్చి కొత్త అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఇంటింటి తగాదాలు తీర్చే పనిలో జీవిత, సుమలత, రోజా చూపించిన సహనం, ఓర్పు, అనుభవం ప్రేక్షకులకు నచ్చింది. ఇక సామాజిక బాధ్యతతో  ‘మేము సైతం’ కార్యక్రమం చేసి బాధితులను ఆదుకున్నారు మంచు లక్ష్మీ. కొన్ని షోలకు హోస్టులుగా సదా, ప్రియమణి, ఖుష్బూ పని చేశారు.
ఇన్‌పుట్స్‌:  గౌతమ్‌ మల్లాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement