మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌పై మచ్చ!
అమితాబ్ బచ్చన్ అంటే సూపర్‌స్టార్ అని టకీమని చెప్పేస్తాం. మరి ఆమిర్ ఖాన్ గురించి చెప్పమంటే వెంటనే ‘మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్’ అని చెప్పేస్తారు. వివాదాలకు, అనవసరపు ప్రచార ఆర్భాటాలకు చాలా దూరంగా ఉన్నట్టు కనపడే ఆమిర్, ‘సత్యమేవ జయతే’ షో చేయడం మొదలుపెట్టిన తర్వాత నీతీ, నిజాయితీకీ చిరునామా అన్నంత ఇమేజ్‌ని సంపాదించుకున్నారు.
అలా ‘మిస్టర్ క్లీన్’ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆమిర్ తన స్వార్థం కోసం ముంబయ్‌లోని బాంద్రాలో నివసిస్తున్నవారిని ఇబ్బందులపాలు చేస్తున్నారనే వార్త వెలుగులోకొచ్చింది. ఆ ఏరియాలో ఆమిర్ పెద్ద బంగ్లా ఒకటి కట్టుకోవాలనుకుంటున్నారట. దాదాపు 20వేల చదరపు అడుగుల్లో భవంతి కట్టించాలన్నది ఆయన ఆలోచన అని సమాచారం.
బాంద్రాలోని హౌసింగ్ సొసైటీవారిని సంప్రదించి, అక్కడ నివసిస్తున్నవారిని ఖాళీ చేయాల్సిందిగా కోరారట ఆమిర్. దాంతో ఆ హౌసింగ్ సొసైటీ రంగంలోకి దిగిందని వినికిడి. ఆమిర్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు, ఆ ఏరియా నుంచి మారినా ఫర్వాలేదనుకున్నవాళ్లు తమ ఇళ్లను అమ్మడనికి పచ్చజెండా ఊపారట. కానీ, పమేలా అనే 87ఏళ్ల వృద్ధురాలు, ఆమె కూతురు మాత్రం ఆమిర్‌కి అడ్డం తిరిగారని తెలిసింది. తమను ఒత్తిడి చేస్తున్న హౌసింగ్ సొసైటీపై కేసు కూడా పెట్టారట ఈ తల్లీకూతుళ్లు. ఉత్తమ నటుడిగానే కాకుండా ఉత్తమ లక్షణాలున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఆమిర్ ఈ విధంగా చేయడం చాలామందిని షాక్‌కి గురి చేసింది. ‘మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్’ ఇలా చేయడం తగదని చెప్పుకుంటున్నారు.