కోటి
కోటి.. పరిచయం అక్కర్లేని సంగీత దర్శకుడు. ఇప్పటి వరకూ తన చేతులతో స్వరాలు సమకూర్చిన ఆయన తొలిసారి లాఠీ పట్టి పోలీస్ పవర్ ఏంటో చూపిస్తానంటున్నారు. దేవినేని నెహ్రూగా తారకరత్న నటిస్తున్న ‘దేవినేని’ సినిమాలో కోటి పవర్ ఫుల్ ఎస్పీ పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అన్నది ఉపశీర్షిక. నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్నారు.
వంగవీటి రాధ పాత్రలో బెనర్జీ, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్ నటిస్తున్నారు. 1983 విజయవాడ తొలి పవర్‌ఫుల్ ఎస్పీ కెఎస్ వ్యాస్‌గారి పాత్రను కోటి పోషిస్తున్నారు. ఆయన పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. కోటి మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌లో ఇది సెకండ్ ఫేజ్. సంగీత దర్శకుడిగా 20 సంవత్సరాలు రాణించాను. శివనాగు వచ్చి ఎస్పీ పాత్ర చేయాలి అనగానే, ‘మా నాన్నగారు నన్ను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలి’ అనుకున్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఒప్పుకున్నాను. 1983తో రాజ్ కోటిగా నా కెరీర్ స్టార్ట్ అయింది.
కెఎస్ వ్యాస్‌గారి పాత్ర చేయడం అరుదైన సంఘటన. నా పాత్రని అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. నర్రా శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్, దేవినేని నెహ్రూ పాత్రలో తారకరత్న పరకాయ ప్రవేశం చేసినట్లు నటిస్తున్నారు. 75 శాతం షూటింగ్ పూర్తి అయింది. మరో షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పతాక సన్నివేశాల్ని గుంటూరు జిల్లా చిలకలూరి పేట హైవేలో భారీగా చిత్రకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. . ‘‘1977లో దేవినేని నెహ్రూ స్టూడెంట్ లైఫ్ నుంచి మా సినిమా ప్రారంభం అవుతుంది. ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల షూటింగ్ జరుపుతున్నాం’’ అన్నారు రాము రాథోడ్.
Comments
Please login to add a commentAdd a comment