
దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. 2019 నుంచి 2022 సంవత్సరాలకు గానూ సంఘ నిర్వాహక వర్గానికి జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రస్తుత సంఘ కార్యవర్గానికి చెందిన నాజర్ అధ్యక్ష పదవికి, విశాల్ కార్యదర్శి పదవికి, కార్తీ కోశాధికారి పదవికి, పూచి మురుగన్, కరుణాస్‌లు ఉపాధ్యక్ష పదవులకు పోటీ చేస్తున్నారు.
వీరితో పాటు 22 మంది కార్యవర్గ సభ్యులు పాండవర్ జట్టు తరఫున పోటీలో ఉన్నారు. అదే విధంగా వీరికి వ్యతిరేకంగా శంకరదాస్ స్వామి జట్టు పేరుతో దర్శక, నటుడు కే.భాగ్యరాజ్ నేతృత్వంలో పోటీకి సిద్ధమయ్యారు. ఈ జట్టులో అధ్యక్ష పదవికి కే.భాగ్యరాజ్, కార్యదర్శి పదవికి ఐసరిగణేశ్, కోశాధికారి పదవికి నటుడు ప్రశాంత్, ఉపాధ్యక్ష పదవులకు ఉదయ, నటి కుట్టిపద్మినిలతో పాటు 22 మంది కార్యవర్గ సభ్యులు పోటీ చేస్తున్నారు.
ఈ సంఘం పదవులు మొత్తం 29 ఉండగా ఈ పదవులకు 87 మంది పోటీలో ఉండటం విశేషం. కొన్ని కారణాల వల్ల కొందరి నామినేషన్లు తిరస్కరింపబడడంతో తుదిగా 87 మంది పోటీలో ఉన్నారు. ముందు తిరస్కరింపబడ్డ నటి ఆర్తీ నామినేషన్‌ను మళ్లీ అంగీకరించారు. అదే విధంగా నటుడు రమేశ్‌ఖన్నా తిరస్కరింపడ్డ తన నామినేషన్‌ను పరిగణలోకి తీసుకోవలసిందిగా లేఖ రాశారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసేవారి తుది జాబితాను గురువారం అధికారికంగా ప్రటించనున్నారు. కాగా గత ఏడాది కంటే మరింత గట్టి పోటీ మధ్య ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.