'నక్షత్రం' మూవీ రివ్యూ | NAKSHATRAM Movie Review | Sakshi
Sakshi News home page

'నక్షత్రం' మూవీ రివ్యూ

Published Fri, Aug 4 2017 12:29 PM | Last Updated on Mon, Sep 18 2017 12:37 PM

NAKSHATRAM  Movie Review

టైటిల్ : నక్షత్రం
జానర్ : యాక్షన్ మూవీ
తారాగణం : సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, తనీష్, ప్రకాష్ రాజ్
సంగీతం : మణిశర్మ, భీమ్స్, భరత్ మధుసూదన్, హరి గౌర
దర్శకత్వం : కృష్ణవంశీ
నిర్మాత : కె.శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు

క్రియేటివ్ డైరెక్టర్ గా స్టార్ ఇమేజ్ అందుకున్న కృష్ణవంశీ కొంతకాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాడు. డిఫరెంట్ సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా స్టార్ ఇమేజ్ అందుకోలేకపోతున్నాడు హీరో సందీప్ కిషన్. మెగా హీరోగా మంచి ఫాంలో కనిపించిన సాయి ధరమ్ తేజ్ కూడా సినిమాల ఎంపికలో తప్పటడుగులతో వరుస ఫ్లాప్ లు చూశాడు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన సినిమానే నక్షత్రం. మరి నక్షత్రం వీరి కెరీర్ లను గాడిలో పెడుతుందా..?

కథ :
తాతల కాలం నుంచి పోలీసు కుటుంబం కావటంతో తాను కూడా పోలీస్ కావాలన్న ఆశయంతో కష్టపడుతుంటాడు రామారావు (సందీప్ కిషన్). పోలీసులను ఒక్కమాట అన్నా సహించలేని రామారావు.. అనుకోకుండా ఓ సారి పోలీస్ కమీషనర్ కొడుకు రాహుల్ (తనీష్)తో గొడవపడతాడు. పోలీసులను కొట్టాడన్న కోపంతో రాహుల్ తో పాటు అతని స్నేహితుల మీద చేయిచేసుకుంటాడు. దీంతో రామారావు మీద పగ పట్టిన రాహుల్, అతనికి పోలీసు ఉద్యోగం రాకుండా చేస్తాడు. ఇక తనకు పోలీస్ ఉద్యోగం రాదన్న బాధతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ న్యాయాన్ని కాపాడటానికే పోలీసే కానవసరం లేదు.. సమాజం పట్ట బాధ్యత ఉంటే చాలని.. ఉద్యోగం లేకపోయినా.. పోలీసు డ్యూటీ చేయాలని నిర్ణయించుకుంటాడు.

అలా డ్యూటీ చేస్తుండగా క్రిమినల్ ముఖ్తార్ కారులో బాంబులు తీసుకెళ్తూ రామారావుకు దొరుకుతాడు. రామారావును నిజం పోలీసు అనుకున్న ముఖ్తార్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కారుతో సహా బాంబులు పేలిపోతాయి. ముఖ్తార్ ను కాపాడిన రామారావు వాణ్ని తన ఇంట్లో దాచిపెడతాడు. అయితే ఈ బ్లాస్ట్ వీడియో టీవీలో చూసిన పోలీసులు రామారావు యూనిఫాం మీద అలెగ్జాండర్ అని నేమ్ ప్లేట్ ఉండటంతో అతని కోసం వెతకటం మొదలు పెడతారు. అసలు అలెగ్జాండర్ ఎవరు..? బాంబ్ బ్లాస్ట్ చేసిన ముఖ్తార్ కి అలెగ్జాండర్ కి సంబంధం ఏంటి..? అలెగ్జాండర్ ఏమయ్యాడు.? ఈ గొడవల నుంచి రామారావు ఎలా బయట పడ్డాడు..? అనుకున్నట్టుగా రామారావుకి పోలీసు ఉద్యోగం వచ్చిందా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
ఎంతో మంది నటులకు ఈ నక్షత్రం కెరీర్ లో చాలా ఇంపార్టెంట్ సినిమా. అందుకు తగ్గట్టుగా ప్రతీ ఒక్కరు ప్రాణం పెట్టి సినిమా కోసం పని చేశారు. ముఖ్యంగా హీరో సందీప్ కిషన్ మాస్ కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ మంచి నటనతో మెప్పించాడు. నెగెటివ్ రోల్ లో యువ నటుడు తనీష్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. గెస్ట్ రోల్ లో కనిపించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్క్రీన్ టైం తక్కువే అయినా.. తనదైన స్టైలో మెప్పించే ప్రయత్నం చేశాడు. రెజీనా పాత్ర కేవలం గ్లామర్ షోకే పరిమితం కాగా.. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ తో పాటు యాక్షన్స్ సీన్స్ తోనూ అలరించింది. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా, బ్రహ్మాజీ లు తమ పరిధిమేరకు పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు :
తన కెరీర్ కు ఎంతో కీలకమైన సినిమా విషయంలో దర్శకుడు కృష్ణవంశీ మరోసారి నిరాశపరిచాడు. తన గత చిత్రాల మాదిరిగా  క్రైం, లవ్, దేశభక్తి లాంటి అంశాలను కలిపి చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు ఆకట్టుకోలేకపోయాడు. క్లారిటీ లేని క్యారెక్టరైజేన్స్, సీన్స్ తో ప్రేక్షకుడ్ని కథలో ఇన్వాల్వ్ చేయలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ అంతా అసలు కథను స్టార్ట్ చేయకుండా గ్లామర్ షోతో నడిపించేయటం బోర్ కొట్టిస్తుంది. ఇంటర్వెల్ తరువాత అసలు కథలోకి ఎంటర్ అయినా.. కథనం మాత్రం నెమ్మదిగా సాగింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు ఆకట్టుకున్నా.. కృష్ణవంశీ గత చిత్రాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే నిరాశ తప్పదు. పాటలు పరవాలేదనిపించినా.. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
లీడ్ యాక్టర్స్ నటన
మెయిన్ స్టోరి

మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
స్లో నేరేషన్

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement