ఎగిరిన ఈగ | Nandi Awards 2012 and 2013 | Sakshi
Sakshi News home page

ఎగిరిన ఈగ

Published Thu, Mar 2 2017 1:42 AM | Last Updated on Fri, Aug 17 2018 2:34 PM

ఎగిరిన ఈగ - Sakshi

ఎగిరిన ఈగ

గత ఐదేళ్లుగా ప్రకటించకుండా జాప్యంలో ఉంచిన నంది అవార్డులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. 2012, 2013 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం ‘నంది అవార్డు’లను ప్రకటించింది. 2012కు సీనియర్‌ నటి జయసుధ, 2013కు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అవార్డు కమిటీలకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ రెండు కమిటీలు ఎంట్రీలను పరిశీలించి, విజేతలను నిర్ణయించాయి. జనరంజక సినిమాలుగా రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ‘ఈగ’, ‘మిర్చి’ ఉత్తమ చిత్రాలుగా ఎంపిక కావడం గమనార్హం. 2012లో ఉత్తమ జాతీయ సమైక్యత, ఉత్తమ లఘు చిత్రం, ఉత్తమ బాలల చిత్రాల విభాగాల్లో ఎవరికీ అవార్డు దక్కకపోవడం బాధాకరం. 2013లో ఉత్తమ బాలల చిత్రం విభాగంలో మినహా అన్ని విభాగాల్లోనూ విజేతలను ఎంపిక చేశారు.

ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో అవార్డులు గెలుచుకొని ‘ఈగ’ 2012 సంవత్సరానికి మేటిగా నిలిచింది. ఒక ఈగను హీరోగా చేసి సినిమాను రక్తి కట్టించడం సామాన్యమైన విషయం కాదు. అందువల్ల కూడా కమిటీకి ఈగ నచ్చి ఉండవచ్చు.

ఈగ ఎత్తు ఆయన ఊహించారు
‘ఈగ’ సినిమాకు నంది అవార్డులు రావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం యూనిట్‌కు మంచి మైలేజ్‌ ఇస్తుందని నిర్మాత సాయి కొర్రపాటి అప్పుడే చెప్పారు. అది నిజమైంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మా చిత్రాన్ని గుర్తించి అవార్డులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. కమిటీకి రుణపడి ఉంటాం. నాతో పాటు ఈ చిత్రానికి నంది అవార్డులు గెలుచుకున్న సుదీప్, సెంథిల్‌కుమార్, కడియాల దేవికృష్ణ, కోటగిరి వెంకటేశ్వరరావు, కీరవాణి, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’కి గానూ నంది అవార్డులు గెలుచుకున్న సమంత, నాని తదితరులకు శుభాకాంక్షలు.  
– దర్శకుడు రాజమౌళి

వాళ్లతో ప్రయాణం ఎంతో ఇష్టం
‘ఈగ’ అనేది రాజమౌళి మాయ. ఆ సినిమాకి ముందు ఆయన సినిమాలు రెండిటిని డిస్ట్రిబ్యూట్‌ చేశా. రాజమౌళికి తెలియని విద్య లేదు. ‘ఈగ’కు రమా రాజమౌళిగారు కాస్ట్యూమ్స్, వల్లీగారు లైన్‌ ప్రొడక్షన్‌ చూసుకున్నారు. కార్తికేయ కూడా పనిచేశాడు. సినిమాలు తీశామా? డబ్బులు వచ్చాయా? అవార్డులు వచ్చాయా? అనేవి పక్కన పెడితే... దేవుడు నాకు కల్పించిన అదృష్టం రాజమౌళి, కీరవాణిలతో పరిచయం. లైఫ్‌లో వీళ్లిద్దర్నీ కలవకపోయుంటే చాలా మిస్‌ అయ్యేవాణ్ణి. వాళ్లతో ప్రయాణం నాకు ఇష్టం.
 – ‘వారాహి’ చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి

వెరీ..వెరీ..వెరీ స్పెషల్‌
ఏ వెరీ స్పెషల్‌ అవార్డు, ఏ వెరీ స్పెషల్‌ ఫీల్మ్, ఏ వెరీ స్పెషల్‌ టీమ్‌. నంది అవార్డు గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఉత్తమ నటి విభాగంలో నంది సొంతం చేసుకున్న సమంతకు శుభాకాంక్షలు.  ‘ఎటో వెళ్లిపోయింది మనసు’  చిత్రానికి అత్యద్భుతంగా దర్శకత్వం వహించిన గౌతమ్‌ మీనన్‌గారికి ధన్యవాదాలు. అవార్డు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రుణపడి ఉంటాను.
– నటుడు నాని

ప్రతి లైన్‌ ప్రయోగమే
ఎంతో లోతుగా ఆలోచించి రాసిన పాట ‘కోటి కోటి తారల్లోన..’ (‘ఎటో వెళ్లిపోయింది మనసు’) ఇందులోని ప్రతి లైన్‌ ఓ ప్రయోగమే. అరిథ్‌మెటిక్స్, ఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ... ప్రతి సబ్జెక్ట్‌ ప్రస్తావన తీసుకొస్తూ, ప్రేమకు సంబంధించిన భావమే అనిపించేలా రాశాను. ప్రయోగాత్మకంగా రాసిన పాటను ప్రభుత్వంవారు గుర్తించడమంటే.. అంతకు మించిన సంతృప్తి ఏదీ ఉండదు.  
 – పాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌

 చాలా హ్యాపీ
‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చిత్రానికి ఉత్తమ నటి కేటగిరీలో నాకు నంది అవార్డు రావడం చాలా సంతోషం.

అవార్డు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఉత్తమ నటునిగా నంది అవార్డు గెలుచుకున్న నానికి శుభాకాంక్షలు.
– కథానాయిక సమంత

కొత్త థ్రిల్‌
నా ఆనందం... ఆశ్చర్యం ఏంటంటే... సుమారు యాభై చిత్రాలకు నేను మాటలు రాశాను. అప్పుడెప్పుడూ నంది అవార్డు రాలేదు. ఉత్తమ మాటల రచయితగా నంది అందుకోవడం ఇదే మొదటిసారి. అల్మోస్ట్‌ నేను రచన మానేసి, దర్శకత్వం వహించిన ‘మిథునం’కి మాటలు రాసుకున్నప్పుడు అవార్డు రావడం ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొత్త థ్రిల్‌. తృతీయ ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు ఎస్పీ బాలుగారు, లక్ష్మీగారికి కూడా స్పెషల్‌ జ్యూరీ అవార్డులు వచ్చాయి. మా చిత్రం విడుదలైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరించారు. ఇప్పుడు ప్రభుత్వం గుర్తించడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా చిత్ర బృందమంతా తమ సొంత చిత్రంలా భావించి పనిచేశారు. నా సంతోషాన్ని వాళ్లందరితో పంచుకుంటున్నాను.
– దర్శక–రచయిత–నటుడు తనికెళ్ల భరణి

ఆ ఆశయం నెరవేరింది
మా ‘మిథునం’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైంది. మన తెలుగువాళ్లందరూ ఆనందపడే రీతిలో అవార్డులు ప్రకటించడం సంతోషంగా ఉంది. నేను ఏ ఆశయంతో అయితే చిత్రాన్ని నిర్మించానో.. ఆ ఆశయం పూర్తిగా సక్సెస్‌ అయింది. ఆనందంగా ఉంది. ‘ఆనంద్‌రావుగారూ.. మీకు మంచి కీర్తి వస్తుందని ఆ రోజే చెప్పాను. నాకెన్నో అవార్డులు వచ్చాయి. వాటన్నిటి కంటే ఈ అవార్డును గొప్పగా ఫీలవుతున్నాను’’ అని బాలుగారు ఫోన్‌ చేసి చెప్పారు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి
– నిర్మాత ఆనంద్‌ ముయిద రావు.

తెలుగు సినిమా ప్రస్థానం
తెలుగు సినిమా ఎనభై ఏళ్ల చారిత్రక ప్రస్థానంపై సీనియర్‌ జర్నలిస్ట్‌ పొన్నం రవిచంద్ర వెలువరించిన ‘ప్రస్థానం’ గ్రంధానికి నంది అవార్డు వరించింది. 1931– 2011 వరకు తెలుగు సినిమాకు సంబంధించి అన్ని ప్రధాన ఘట్టాల్ని చిత్రాలతో సహా పొందుపరిచారు. సినీ ప్రముఖుల జీవిత చరిత్రలతో పాటు ఆయా కాలాల సినిమా విశేషాలను ఇందులో ప్రస్తావించా రు. సంవత్సరాల వారీగా తెలుగు సినిమాలు, ఫాల్కె అవార్డు గ్రహీతల వివరాలు, నంది అవార్డుల వివరాలు ఇందులో ఉన్నాయి. కరీంనగర్‌కు చెందిన పొన్నం రవిచంద్ర మూడు దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నారు. రాజకీయ, సాహిత్య, కళారంగాలకు చెందిన అంశాలపై పలు  వ్యాసాలు రాశారు. ప్రస్తుతం కరీంనగర్‌ ఫిల్మ్‌ సొసైటి కార్యదర్శిగా ఉన్నారు.
- పొన్నం రవిచంద్ర

అమ్మ గుర్తొచ్చారు
నేను డబ్బింగ్‌ థియేటర్‌ లో ఉన్నప్పుడు నటి రజితగారు ఫోన్‌ చేసి ‘ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు వచ్చింది’ అని చెప్పారు. నమ్మలేదు. తర్వాత హ్యాపీగా ఫీలయ్యా. ‘ఓనమాలు’ దర్శకుడు క్రాంతి మాధవ్‌కి, సంభాషణల రచయిత ఖదీర్‌గారికి కృతజ్ఞతలు. స్టేజి ఆర్టిస్టుగా 2005లో నంది అవార్డు అందుకున్నా. సినిమా రంగంలో ఇదే తొలి నంది. ఈ అవార్డు వచ్చిందనగానే మా అమ్మగారు గుర్తుకొచ్చారు. ఆమె ఉండి ఉంటే సంతోషించేవారు. నాన్నగారు ఫుల్‌ హ్యాపీ.
– నటుడు రఘుబాబు

ఇన్నేళ్ల కష్టానికి గుర్తింపు
‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్‌లో ఉన్నా. ఓ స్నేహితుడు ఫోన్‌ చేసి, నంది అవార్డు వచ్చిందని చెప్పాడు. ‘ఇష్క్‌’ రిలీజై ఐదేళ్లవుతోంది.. ఇప్పుడు అవార్డు రావడమేంటి? అని ఆశ్చర్యం  వేసింది. నటుడిగా ఇన్నేళ్ల నా కష్టానికి ‘నంది’ అవార్డు ఓ గుర్తింపుగా నిలిచింది. తొలిసారి ఈ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని ‘ఇష్క్‌’ టీమ్‌తో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటా. ఇకపైనా మంచి పాత్రలు ఎంచుకుని వాటికి న్యాయం చేస్తా. నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్, నిర్మాతలు పి.సుధాకర్‌ రెడ్డి, విక్రమ్‌ గౌడ్‌లకు కృతజ్ఞతలు.
- నటుడు అజయ్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement