
అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతను ఏ భాషలో, ఏ యాసలో చెప్పాడంటారు? ఇద్దరూ ఏ భాషలో, ఎలా మాట్లాడుకున్నారంటారు? సంస్కృతంలోనేనా!! తెలుగు సినిమాల్లో మాత్రం పద్యాలను సంస్కృతంలో, మాటలను గ్రాంథికంలో... అదీ తెలుగులో చెప్పాడు. మన ప్రేక్షకులకు అర్థమయ్యేలా! నాని హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కృష్ణార్జున యుద్ధం’లో కృష్ణార్జునులు మోడ్రన్ అండ్ లోకల్ బాయ్స్.
అందులో ఒకరు చిత్తూరు యాసలో సిల్వర్ స్క్రీన్‌పై చించేస్తాడట! వెంకట్ బోయినపల్లి సమర్పణలో సాహూ గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు పాత్రల్లో ఓ పాత్ర చిత్తూరు యాసలో మాట్లాడుతుంది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కొంతవరకూ జరిగింది.
అనుపమా పరమేశ్వరన్ ఓ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నారట. అంతకంటే ముందు... నాని థియేటర్లలో ఓసారి సందడి చేయనున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న మరో సినిమా ‘ఎంసిఎ’ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రేపు ఉదయం పది గంటలకు ఈ సిన్మా టీజర్ విడుదలవుతోంది.