
ప్రేమ కవితలు రాస్తున్న హీరోయిన్
నటి నయనతార అనగానే చాలా మందికి ఆమె నటన, పారితోషికం, ప్రేమలో పడటం, పెళ్లి విషయంలో ఓడిపోవడం ఈ విషయాలే తెలుసు.
సాక్షి, హైదరాబాద్: నటి నయనతార అనగానే చాలా మందికి ఆమె నటన, పారితోషికం, ప్రేమలో పడటం, పెళ్లి విషయంలో ఓడిపోవడం ఈ విషయాలే తెలుసు. ఇలాంటి విషయాల గురించి ఎంతసేపు మాట్లాడుకుంటారు.. నాణానికి బొమ్మా బొరుసులాగా ప్రతి మనిషిలోనూ పలు కోణాలుంటాయి. అలా నయనతారలో మరో కోణం చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. నయనతారలో మంచి చెఫ్ ఉన్నారు. షూటింగ్ లేని సమయాల్లో రకరకాల వంటకాలతో ప్రయోగం చేయడం ఆమె కాలక్షేపాల్లో ఒక అంశం అట.
నయనతారలో మరో ముఖ్య అంశం తనలో మంచి కవయిత్రి ఉన్నారట. ఇప్పటికే చాలా కవితలు రాశారట. వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరచుకున్నారట. విశేషం ఏమిటంటే తను రాసిన కవితలన్నిటిలోనూ ప్రేమ తొణికిసలాడుతుందని టాక్. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్లు ఎలా ఉండాలన్న విషయాలు ఆ కవితల్లో చోటు చేసుకుంటాయట. తన రాసిన కవితలను తరచూ చదువుకుంటారట. ఆ కవితలను ఒక పుస్తకంగా ముద్రించాలా? లేక సినిమా పాటలుగా ఉపయోగించాలా అన్న విషయం గురించి ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొత్తంమీద నయనతార కవితలను త్వరలో పుస్తకం రూపంలోనో, పాటల రూపంలోనో చదవడమో, వినడమో చేయబోతున్నామన్న మాట.