
నయనతార, రజనీకాంత్
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో అగ్రనటి నయనతార మరోసారి నటించనుందా? అలాంటి చర్చే తాజాగా కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ జంట ఇప్పటికే చంద్రముఖి, కుశేలన్ చిత్రాల్లో కలిసి నటించారు. అంతే కాదు నయన్.. శివాజీ చిత్రంలో రజనీతో ఒక పాటకు చిందేసింది కూడా. అయితే అప్పటి నయనతార స్థాయి వేరు ఇప్పటి స్థాయి వేరు. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల నాయకిగా ఎదిగి, లేడీసూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార, సూపర్‌స్టార్ రజనీకాంత్ కలిసి నటిస్తే ఆ క్రేజే వేరు.
తాజాగా అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయని సమాచారం. 2.ఓ, కాలా చిత్రాలను పూర్తి చేసిన రజనీకాంత్ తాజాగా యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికిక సిద్ధం అవుతున్నారన్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌తో జత కట్టే హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకూ నయనతార, అనుష్క, త్రిష పేర్లతో పాటు ఉత్తరాది తారల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక నటి త్రిషకు సూపర్‌స్టార్‌తో నటించాలన్నది చిరకాల కోరిక.
దీంతో తాజా చిత్రంలో ఆయనకు జంటగా నటించే అవకాశం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాంటి అవకాశం లేకపోతే ఆయన చిత్రంలో ఏదో ఒక పాత్ర చేయడానికైనా రెడీ అని ఓపెన్ ఆఫర్ ఇచ్చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే చిత్ర వర్గాలు మాత్రం నయనతారపైనే దృష్టి సారించినట్లు తాజా సమాచారం. ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు, నయనతార కూడా రజనీకాంత్‌తో మరోసారి రోమాన్స్ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.
అయితే ఇప్పటికే తెలుగులో చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న నయనతార కోలీవుడ్‌లో అజిత్‌కు జంటగా విశ్వాసం చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. అదే విధంగా దర్శకుడు అరివళగన్ చిత్రంలో నటించడానికి అంగీకరించింది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టికి జంటగా ఐదోసారి నటించడానికి పచ్చజెండా ఊపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదీ తెలుగు చిత్రమే.
Comments
Please login to add a commentAdd a comment