
ఇండియాలో... జాకీచాన్ డ్యాన్స్!
మార్షల్ ఆర్ట్స్ స్టార్ జాకీచాన్ గురించి సినీ అభిమానులకు పరిచయ వాక్యాలు అవసరం లేదు. ఫైట్స్ చేస్తూనే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఈ సూపర్‌స్టార్ డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుంది? అదీ మన బాలీవుడ్ స్టయిల్ పాటకు! ప్రస్తుతం జాకీచాన్ ఆ సన్నాహాల్లోనే ఉన్నారని సమాచారం. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న ఇండో-చైనీస్ చిత్రం ‘కుంగ్‌ఫూ యోగా’. స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో రూపొందు తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ తారలు దిశా పాట్నీ (‘లోఫర్’ ఫేమ్), అమైరా దస్తర్ (‘అనేకుడు’ ఫేమ్) కథానాయికలు కాగా, సోనూ సూద్ విలన్. కొన్ని వేల ఏళ్ల క్రితం పర్వత శ్రేణుల్లో దాగిన ఓ నిధి చుట్టూ సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో జాకీ పురావస్తు పరిశోధన విభాగ అధ్యాపకునిగా కనిపించనున్నారట. ఇందులో బాలీవుడ్ శైలిలో సాగే ప్రత్యేక గీతంలో అమైరా దస్తర్, దిశా పాట్నీలతో కలిసి జాకీచాన్ కాలు కదపనున్నారట. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జోధ్‌పూర్ ప్యాలెస్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ జరగనుంది. ఈ నెల 20న జాకీచాన్ దీని కోసం ఇండియా రానున్నారట. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పాటను గ్రాండియర్‌గా మూడు వారాల పాటు చిత్రీకరించనున్నారు.