అప్పటి నుంచి నా సినిమాలు చూడడం మానేశా!
‘‘వైవిధ్యమైన, మంచి చిత్రాల్లో నటిస్తాననే గుర్తింపు వచ్చింది. ప్రేక్షకుల్లో నాకున్న మంచి పేరు నిలబెట్టే చిత్రాలు చేయాలనుకుంటున్నా. సాధారణ కమర్షియల్ చిత్రాల్లో నటించాలంటే భయం, రిస్క్ కూడా. యంగ్ హీరోలు ప్రేక్షకులను ఆకర్షించాలంటే కథలో కొత్తదనం ఉండాల్సిందేనని నా అభిప్రాయం’’ అన్నారు నిఖిల్. ఆయన హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో పి. వెంకటేశ్వరరావు నిర్మించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ రేపు రిలీజవుతోంది. నిఖిల్ చెప్పిన విశేషాలు...
ఓ సీసాతో మొదలైన కథ, ఆ సీసాతోనే ముగుస్తుంది. అందులో ఏముందనేది సస్పెన్స్. మరణించిన మనిషి 21 గ్రాములు బరువు తగ్గుతాడని సైన్స్ చెబుతోంది. ఆ 21 గ్రాములు ఏమైనట్టు? ఆత్మలు ఉన్నాయా? లేవా?.. ఇలా అంతు చిక్కని అంశాలు బోలెడున్నాయి. హారర్ కామెడీతో కూడిన ఫ్యాంటసీ ప్రేమకథా చిత్రమిది. ఈ చిత్రంలో ‘బాహుబలి’ చిత్రం గ్రాఫిక్ డిజైనర్‌గా కనిపిస్తా. రాజమౌళిగారితో ఫోనులో మాట్లాడే సీన్లు కామెడీగా ఉంటాయి. ఓ కథ అంగీకరించాక దర్శక- నిర్మాతల పనుల్లో జోక్యం చేసుకోను. అవసరమైతే నా ఖర్చుల్లో కోత విధిస్తా. నిర్మాతకు లాభాలొస్తేనే నేను విజయం సాధించి నట్టు.
ప్రచార కార్యక్రమాల్లో మాత్రం రాజీపడను. ‘స్వామి రారా’ నుంచి సెంటిమెంట్‌గా నా చిత్రాల్ని చూడడం మానేశా. ఈ చిత్రాన్ని చూడలేదు. చూసినోళ్లంతా బాగుందన్నారు. ఫెయిల్యూర్స్ సహజమే. అయితే, ఎవరి ఒత్తిడి వల్లో సినిమా లు చేయకూడదనేది ‘శంకరాభరణం’తో అర్థమైంది. ప్రస్తుతం ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నా. చందూ మొండేటి ‘కార్తికేయ-2’ స్క్రిప్ట్ రెడీ చేశాడు.