
నాకు 'మెగా' ఇమేజ్ వద్దు..
చెన్నై: మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఇమేజ్లో తాను కలిసిపోవాలనుకోవడం లేదని చిరంజీవి మేనల్లుడు, యువ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ అన్నారు. ఆ ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ను అడ్డం పెట్టుకొని తాను పైకి రావాలనుకోవడం లేదని, సొంత గుర్తింపు తెచ్చుకుంటానని చెప్పారు. తనకంటూ ఒక గుర్తింపు ఉండటం చాలా ముఖ్యమైన విషయమని చెప్పారు.
మెగా ఫ్యామిలీ వల్లే తనకు అవకాశాలు విరివిగా వస్తున్నాయనేది నిజమే అయినప్పటికీ.. తన పనిని బట్టే ప్రేక్షకులు ఆదరిస్తారని, నటన విషయంలో న్యాయనిర్ణేతలు వారేనని అన్నారు. గొప్ప కుటుంబం నుంచి వచ్చాను కదా అని చెడ్డ సినిమాలో నటిస్తే ఎవరూ ప్రేమించరని చెప్పారు. 'రేయ్', 'పిల్లా నువ్వు లేని జీవితం' వంటి చిత్రాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి తేజ్ ఇప్పుడు త్వరలో విడుదల కానున్న హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పాటలు ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఈనెల 24న 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' ప్రేక్షకుల ముందుకు రానుంది.