Officer Movie Review, in Telugu | ‘ఆఫీసర్‌’ మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

‘ఆఫీసర్‌’ మూవీ రివ్యూ

Published Fri, Jun 1 2018 12:31 PM | Last Updated on Fri, Jun 1 2018 4:45 PM

Officer Telugu Movie Review - Sakshi

చిత్రం: ఆఫీసర్‌
జోనర్‌: యాక్షన్‌ థ్రిల్లర్‌
నటీనటులు: నాగార్జున అక్కినేని, మైరా సరీన్‌, బేబీ కావ్యా, ఫెరోజ్‌ అబ్బాసీ, అజయ్‌ తదితరులు
సంగీతం: రవి శంకర్‌
బ్యానర్‌: ఆర్‌ కంపెనీ ప్రొడక్షన్‌
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకుడు: రామ్‌ గోపాల్‌ వర్మ

విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, కింగ్‌ నాగార్జున దాదాపు పాతికేళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపారు. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కిన చిత్రమే ఆఫీసర్‌. కర్ణాటకకు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ ప్రసన్న జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వర్మ చెప్పుకొచ్చాడు. మరి వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ఈ కాప్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను మెప్పించగలిగిందా? వరుస పరాజయాలతో ఉన్న వర్మకు ఊరట లభించిందా? రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

కథ:
నారాయణ్‌ పసారి(ఫెరోజ్‌ అబ్బాసీ) ముంబైలో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌. వరుస ఎన్‌కౌంటర్‌లతో ముంబైలో మాఫియా అనేది లేకుండా చేస్తుంటాడు. దీంతో ప్రజల్లో అతనికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడుతుంది. అయితే అదే సమయంలో నారాయణ ఓ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో చిక్కుకుంటాడు. ఈ కేసును దర్యాప్తు చేపట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన అధికారి శివాజీ రావు(నాగార్జున అక్కినేని) నేతృత్వంలో ఓ కమిటీని అధికారులు నియమిస్తారు. విచారణలో పసారికి అండర్‌ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నట్లు తేలుతుంది. దీంతో పసారిని అరెస్ట్‌ చేసి కోర్టు బోనులో నిలబెడతాడు శివాజీ. అయితే తన నెట్‌వర్క్‌ను ఉపయోగించి పసారి నిర్దోషిగా బయటపడతాడు. కేసు ఓడిపోవటం ఇష్టం లేని శివాజీ ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని అక్కడే ఉండిపోతాడు. తనని అరెస్ట్‌ చేయించాడన్న పగతో పసారి.. శివాజీపై పగబడతాడు. అక్కడి నుంచి వీరిద్దరి మధ్య వార్‌ మొదలౌతుంది. తర్వాత జరిగే పరిణామాలు, మధ్యలో ఓ ట్విస్ట్‌, చివరకు యుద్ధంలో గెలుపు ఎవరిది? అన్నదే ఆఫీసర్‌ చిత్ర కథ.

నటీనటులు:
సీరియస్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నాగార్జున మెప్పించాడు. థ్రిల్లర్‌ సినిమాకు కావాల్సిన ఇంటెన్సిటీని తన నటనలో చూపించాడు. ఈ వయసులో కూడా ఫిట్‌గా కనిపించాడు. శివాజీ పాత్రకు తన వంతు న్యాయం చేశాడు.  ఇక హీరోయిన్‌ సైరా మరీన్‌ది చిన్న పాత్రే. నటనపరంగా ఫర్వాలేదనిపించింది. నెగటివ్‌ రోల్‌తో ఫెరోజ్‌ అబ్బాసీ మెప్పించాడు. అవినీతి అధికారిగా పసారీ పాత్రలో ఆకట్టుకున్నాడు. బేబీ కావ్య నటన బావుంది.  అజయ్‌ తప్ప మిగతా పాత్రలన్నీ తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియనివే. 

విశ్లేషణ:
ముందుగా ఈ కాంబోలో సినిమా అనౌన్స్‌ చేసినప్పుడు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే టీజర్‌, ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక ఆ అంచనాలపై ఒకరకమైన అనుమానాలు మొదలయ్యాయి. అయితే చాలా కాలం తర్వాత వర్మ చేసిన సీరియస్‌ ప్రయత్నమే ఆఫీసర్‌. గత చిత్రాలతో పోలిస్తే బెటర్‌గా అనిపిస్తుంది. సాధారణంగా పోలీస్‌-మాఫియా కథనాలతో సినిమాలు తీసే వర్మ.. తన వరకు డిపార్ట్‌మెంట్‌లో అధికారుల మధ్య ఘర్షణ, విచారణలాంటి కొత్త పాయింట్‌తో కథను రూపొందించుకున్నాడు. నాగార్జున-విలన్‌ పాత్రలను తీర్చి దిద్దిన తీరు, ఫస్టాఫ్‌లో డిఫరెంట్‌ స్టోరీ లైన్‌ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. కానీ, సెకండాఫ్‌లో వర్మ ఆ అంచనాలను కొనసాగించలేకపోయాడు.  నెమ్మదిగా సాగే కథనం, పాటలు ప్రేక్షకులకు చికాకు పుట్టిస్తాయి. పోలీసాఫీసర్‌ అయిన విలన్‌.. మాఫియాతో చేతులు కలిపి హీరోపై పగ తీర్చుకోవాలని చేసే యత్నాలు సిల్లీగా అనిపిస్తాయి. మిగతా పాత్రలను కూడా దర్శకుడు చాలా బలహీనంగా తీర్చి దిద్దాడు. డైలాగులు కూడా మెప్పించలేకపోయాయి. సెకండ్‌ హాఫ్‌లో కథ మరీ నెమ్మదిగా సాగటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. క్లైమాక్స్‌లో మాత్రం హీరోయిజం బాగుంది.

సాంగ్స్‌తో మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి శంకర్‌ నిరాశపరచగా.. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో బిస్వాస్‌ ఆకట్టుకున్నాడు. చాలా సందర్భాల్లో సౌండ్‌ థ్రిల్‌ చేస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ ప్రయోగంలో వర్మను అభినందించొచ్చు. పాత్రల ఎంపిక, కెమెరా పనితనంలో ఆర్జీవీ మార్క్‌ కనిపిస్తుంది. అయితే పాత్రలు పరిచయం లేనివి కావటంతో ఒకానోక టైంలో డబ్బింగ్‌ సినిమా చూస్తున్నామా? అన్న ఫీలింగ్‌ కలుగుతుంది. నిర్మాణ విలువలు ఆకట్టుకునేలా లేవు. తాను అనుకున్న కథను సిన్సియర్‌గా తెరకెక్కించిన వర్మ.. థ్రిల్లర్‌ సినిమాకు కావాల్సిన వేగాన్ని మాత్రం అందించలేకపోయాడు. లాజిక్‌లు మాట్లాడే వర్మ.. కొన్ని సన్నివేశాల్లో ఇంటలిజెన్సీకి అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ఆలోచన చేయలేకపోయాడు. గంట 55 నిమిషాల నిడివిలో సినిమాటిక్‌ అనుభూతిని అందించలేకపోవటం గమనార్హం. పూర్తిస్థాయిలో సీరియస్‌గా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరించటం అనుమానమే. మొత్తానికి నాగ్‌ ఇచ్చిన అవకాశాన్ని దర్శకుడు వర్మ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేదనే చెప్పొచ్చు.

ఫ్లస్‌ పాయింట్లు:
హీరో-విలన్‌ పాత్రలు
డిఫరెంట్‌ స్టోరీ లైన్‌

మైనస్‌ పాయింట్లు:
క్యారెక్టర్లను బలంగా తీర్చిదిద్దలేకపోవటం
ప్రొడక్షన్‌ విలువలు
సెకండాఫ్‌లో నారేషన్‌

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement