
పండక్కి రావడం పక్కా!
వీలయితే సంక్రాంతి.. లేదంటే దసరా.. పండగ సీజన్‌లో వెండితెరపై సందడి చేయడం రామ్‌చరణ్ అలవాటు. ఇప్పటివరకూ ఈ మెగాపవర్ స్టార్ నటించిన చిత్రాల్లో...
వీలయితే సంక్రాంతి.. లేదంటే దసరా.. పండగ సీజన్‌లో వెండితెరపై సందడి చేయడం రామ్‌చరణ్ అలవాటు. ఇప్పటివరకూ ఈ మెగాపవర్ స్టార్ నటించిన చిత్రాల్లో ‘నాయక్’, ‘ఎవడు’ సంక్రాంతికి, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘బ్రూస్‌లీ’ చిత్రాలు దసరాకి విడుదలయ్యాయి. ఈ దసరాకి కూడా రామ్‌చరణ్ రావడం పక్కా. రామ్ చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ధ్రువ’. అక్టోబర్ 7న విడుదల కానుందీ సినిమా. దసరాకి వారం రోజుల ముందే రామ్‌చరణ్ రానున్నారు.
ఇదిలా ఉంటే.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ చిత్రం ఫస్ట్ లుక్, పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న టీజర్‌ను విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘రోజా’ ఫేమ్ అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా, రామ్‌చరణ్ స్నేహితుడిగా నవదీప్ నటిస్తున్న ఈ సినిమా తమిళంలో విజయవంతమైన ‘తని ఒరువన్’కి తెలుగు రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ ఆది.