కన్నీళ్లు.. కరతాళ ధ్వనుల మధ్య లేడీ గగా!
ఆస్కార్ వేడుకల్లో ఎమోషనల్ మూమెంట్స్ అనదగ్గవాటిలో లేడీ గగా పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కాలేజీ క్యాంపస్‌లలో జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో రూపొందించిన ‘ది హంటింగ్ గ్రౌండ్’ అనే లఘు చిత్రంలోని ‘టిల్ ఇట్ హ్యాపెన్స్ టు యు’ అనే పాటను ఆమె పాడారు. డాయనె వారెన్ అనే రచయితతో కలిసి లేడీ గగా ఈ పాట రాసి, పాడి, నటించారు. ఈ పాట ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. పాట పాడుతూ చివర్లో కన్నీటి పర్యంతమైన గగాకి, చెమర్చిన కళ్లతో, కరతాళ ధ్వనులతో వీక్షకులు అభినందనలు తెలియజేశారు.
గగా ఈ పాట పాడే ముందు యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్ మాట్లాడుతూ- ‘‘ఆడవాళ్లపై మాత్రమే కాదు.. మగవాళ్లపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. వీటిపై ప్రతి విద్యార్థీ పోరాడాలి. మనందరం ఈ దాడులను అంతం చేయడానికి నడుం బిగిస్తే, బాధితులే ఉండరు’’ అని ఉద్వేగంగా మాట్లాడారు. అంతకుముందు రెడ్ కార్పెట్‌పై గగా మాట్లాడతూ - ‘‘ఐదుగురు అమ్మాయిల్లో ఒక్క అమ్మాయి, 20మంది అబ్బాయిల్లో ఒక్క అబ్బాయి చదువు పూర్తి చేసేలోపే లైంగిక వేధింపులకు గురవుతాడు’’ అని పేర్కొన్నారు. 19 ఏళ్ల వయసులో తనపై జరిగిన అత్యాచారాన్ని గుర్తు చేసుకుంటూ గగా ఈ మాటలు మాట్లాడినట్లుగా అనిపించింది. ఆ చేదు సంఘటన తాలూకు బాధ ఆమె కళ్లల్లో స్పష్టంగా కనిపించింది.