కన్ను కుట్టి | our audar love teaser sensenational successful | Sakshi
Sakshi News home page

కన్ను కుట్టి

Published Fri, Feb 16 2018 12:17 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

our audar love teaser sensenational successful - Sakshi

ప్రియా ప్రకాశ్‌ కేరళ కుట్టి.. తను కన్ను కొట్టి.. ఎంతోమందిని టెన్షన్‌లో పెట్టి అభిమానులతో చేయిస్తోంది వెట్టి

ఎవరీ ప్రియాప్రకాశ్‌ వారియర్‌. సమాజాన్ని ఉద్ధరించే పనేదైనా చేసిందా? పోనీ నలుగురికి ఉపయోగపడే పనేదైనా? పోనీ ఇద్దరికి.. ఊహూ.. ఒక్కరికి. అబ్బే లేదు. మరేం చేసింది అంటే.. జస్ట్‌ కన్ను కొట్టింది. అంతే... లక్షలాది మంది ‘ఫ్లాట్‌’. సినిమా రిలీజ్‌కి ముందు టీజర్‌ వదులుతారు కదా? ఆ టీజర్‌లో రెండు కనుబొమలను పైకి లేపి, చిరునవ్వు నవ్వి, కన్నుకొట్టి... బాసూ.. ఓవర్‌నైట్‌ స్టార్‌ అవ్వడానికి ఇంత చేస్తే చాలు. ప్రియ చేసింది ఇంతే. అంతే.. నిన్న మొన్నటి వరకూ తనెవరో కేరళలో కూడా చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేమస్‌. ఇంత పాపులార్టీ తెచ్చుకున్నది కన్ను కొట్టినందుకు.. అందంగా కొట్టినందుకు.

సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఈ మలయాళీ టీనేజ్‌ గర్ల్‌ ఫేమస్‌. ఆ మాత్రం చాలు ఈ అమ్మాయి యాక్ట్‌ చేసిన ‘ఒరు అడార్‌ లవ్‌’ సినిమా ఫేమస్‌ అయిపోవడానికి. టీజర్‌తోనే ఇంత సెన్సేషన్‌ అయింది కాబట్టి ఈసారి ఇంకో టీజర్‌ వదిలారు. ఇప్పుడు ప్రియా ఏం చేసిందో టీజర్‌ చూసినవారికి తెలిసే ఉంటుంది. అయినా చెబుతాం. దొండపండులాంటి పెదాల మీద రెండు వేళ్లు పెట్టుకుని ‘మ్చ్‌’ అంటూ బాయ్‌ఫ్రెండ్‌కి ఓ ముద్దు విసిరింది.

అంతేనా.. ఆ రెండు వేళ్లను పెదాల మీద నుంచి తీసేసి, గన్నులా పెట్టి, కన్ను కొట్టి షూట్‌ చేసేట్లు సైగ చేస్తుంది. అంతే.. అక్కడ ఉన్నది తూటా కాకపోయినా సూటిగా గుండెల్లో గుచ్చుకున్నట్లు ఆ కుర్రాడు ఫీలయ్యాడు. చూసిన కుర్ర హృదయాల్లో డ్రీమ్‌ గర్ల్‌ అయి కూర్చుంది ప్రియ. ఈ టీజర్‌ తనను ఇంతగా పాపులర్‌ చేస్తుందని ప్రియ ఊహించలేదు. ‘‘ఇంతమంది చూపిస్తున్న ప్రేమను ఎలా హ్యాండిల్‌ చేయాలో అర్థం కావడంలేదు. ఇది కలా? నిజమా?’’ అనిపిస్తోంది అని ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఇప్పుడు ప్రియాప్రకాశ్‌ తన ఇంట్లో తానే ఉండలేకపోతోంది. ఎందుకో తెలుసా? ఎప్పుడెప్పుడు ఈ బ్యూటీ బయటికొస్తుందా? అని ఎదురు చూస్తూ ఇంటి గేటు ముందు పహారా కాస్తున్నారట. అందుకే ప్రియాని ఆమె తల్లి ఇంట్లో నుంచి పంపించేశారు. అయ్యో.. మనసెలా వచ్చింది అనుకుంటున్నారా? మరేం లేదండి. మూడో కంటికి తెలియకుండా ప్రియాని హాస్టల్‌కి పంపించేశారు. అది లేడీస్‌ హాస్టల్‌ కాబట్టి నో ప్రాబ్లమ్‌. ఇంతకీ ప్రియాప్రకాశ్‌ ఏం చదువుకుంటోంది? బ్యాగ్రౌండ్‌ ఏంటి? అంటే..

ప్రియాప్రకాశ్‌ వారియర్‌ వయసు 18. ఊరు కేరళలోని త్రిశ్సూరు. అక్కడి విమలా కాలేజీలో బీకామ్‌ స్టూడెంట్‌. క్లాసికల్‌ డ్యాన్స్‌లో ట్రైనింగ్‌ తీసుకుంది. మోడలింగ్‌ అంటే మోజు. అందుకే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మోడలింగ్‌లోకి ఎంటరైంది. పలువురు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్స్‌ కోసం ర్యాంప్‌ వాక్‌ చేసింది. అప్పుడెవరూ ఊహించలేదు. ప్రియా ఓవర్‌నైట్‌ స్టార్‌ అవుతుందని. అన్నట్లు టీజర్స్‌లో ప్రియా కూర్చుని కనిపించింది. మరి.. నిలబడితే ఎంత ఎత్తు ఉంటుందంటే.. సుమారు 5 అడుగుల 4 అంగుళాలు. బరువు 50 కేజీలు. ఎత్తుకి తగ్గ బరువు అని చెప్పొచ్చు.

అబ్బాయిల గుండెల్లో సునామీ
ప్రియా ఫస్ట్‌ మూవీ ‘ఒరు అడార్‌ లవ్‌’ త్వరలో రిలీజ్‌ కానుంది. టీజర్‌ ఎఫెక్ట్‌తో మేం కొంటామంటే మేం కొంటామంటూ బయ్యర్లు క్యూలు కట్టారట. బిజినెస్‌ బ్రహ్మాండంగా జరుగుతోంది. రిలీజ్‌ తర్వాత టికెట్లు కూడా బ్రహ్మాండంగా తెగుతాయి. అన్నట్లు.. ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో అనువదించి, విడుదల చేయాలనుకుంటున్నారు. చిన్నగా మొదలయ్యే చినుకు తుఫానుకి కారణమవుతుంది.

అలాగే చిన్ని ఎక్స్‌ప్రెషన్‌ కుర్రకారు హృదయాల్లో సునామీ సృష్టించింది. మరోవైపు కొంతమంది హీరోయిన్ల గుండెల్లో అలజడి సృష్టించింది. ప్రియాప్రకాశ్‌ గట్టి పోటీ అవుతుందని ఇప్పటికే చాలామంది జోస్యం చెబుతున్నారు. ప్రియా.. వాట్‌యా? వాటీజ్‌ దిస్‌ యా? అలవోకగా కనురెప్ప మూసి.. యువత కనురెప్పలు మూతపడకుండా చేశావ్‌ యా.. యా.. యా..?

గుండె దిటవు చేసుకోండి
ప్రియాప్రకాశ్‌ను తొలిసారి చూసి ఇష్టపడిన అమర ప్రేమికుల్లారా.... ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ టీజర్‌’ రోమియోల్లారా... ప్రియా ప్రకాశ్‌ కోసం గుండెల్లో గుడి కట్టడానికి ముడి సరుకులు తెచ్చుకున్న యువకుల్లారా.... గుండె దిటవు చేసుకోండి. మీరు ఇష్టపడుతున్న ప్రియా రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ సింగిల్‌ కాదట.

‘స్పూఫ్‌’ వీడియోల హల్‌చల్‌
ప్రియా కన్ను కొట్టిన వీడియో చూసి, తమ అభిమాన హీరోలు కన్ను కొట్టిన సీన్‌తో పోల్చి, రెంటినీ కలిపి ఓ వీడియోగా క్రియేట్‌ చేసి, అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఉదాహరణకు...
∙‘ముత్తు’ సినిమాలో రజనీకాంత్‌ సిగ్గుపడితూ కన్ను కొట్టే సీన్‌ ∙‘అతడు’ సినిమాలో కన్ను కొట్టే సీన్‌లో ‘ఇలా కొట్టు..అలా పడి ఉంటారు’ అని హీరోయిన్‌ త్రిషకు మహేశ్‌బాబు చెప్పే సీన్‌ను భలేగా ఎడిట్‌ చేశారు ∙‘తెరీ’ సినిమాలో హీరోయిన్‌ను చూసి తమిళ హీరో విజయ్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ∙‘ఏం మాయ చేసావే’ తమిళ వెర్షన్‌ ‘విన్నైత్తాండి వరువాయా’ సినిమాలో త్రిషను ఫస్ట్‌టైమ్‌ చూసినప్పుడు ఎక్స్‌ప్రెషన్స్‌ ∙‘ప్రేమమ్‌’ సినిమాలో నివిన్‌ పౌలీ హీరోయిన్‌ సాయిపల్లవిని చూసి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌.

ఇది ఇప్పటి పాట కాదు
విశేషం ఏంటంటే.. ‘ఒరు అడార్‌ లవ్‌’ టీజర్‌ బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తోన్న ‘మాణిక్య మలరాయ పూవీ’ పాట ఈ సినిమా కోసం ఫ్రెష్‌గా రాసింది కాదు. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం పి.యం జబ్బర్‌ రాసిన ‘మాపిళ్ల..’ అనే  పాటకు స్టైలిష్‌ వెర్షన్‌... అదేనండి రీమిక్స్‌ అని కేరళ టాక్‌. అక్కడివారి మాటల ప్రకారం ఈ పాటకున్న చరిత్ర అంతా ఇంతా కాదని తెలుస్తోంది.

మహమ్మద్‌  ప్రవక్త మొదటి భార్య ఖజీదా బీవీ గుణాలను వివరిస్తూ జబ్బర్‌ రాసిన ఈ పాట కేరళలో చాలా ఫేమస్‌. ఈ పాటను పెళ్లిళ్లు, ఇతర ముఖ్య ఫంక్షన్స్‌లో పాడుకుంటారట. అలా ఒరిజినల్‌ వెర్ష¯Œ  చాలా పాపులర్‌ అట∙ ఒకవైపు ఇంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోన్న ప్రియాపై ప్రేమే కాదు ఈ పాటకు ఆగ్రహం కుడా వ్యక్తం చేస్తున్నారు కొందరు. పాట తమ మత మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందంటూ హైదరాబాద్‌లో ఈ చిత్రదర్శకుడు ఒమర్‌ లులూపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కొందరు యువకులు.

∙‘ఒరు అడార్‌ లవ్‌’ టీజర్‌ మాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. స్టార్‌ హీరోల మూవీ టీజర్‌ వ్యూస్‌ రికార్డ్స్‌ను బ్రేక్‌ చేసింది. 24 గంటల్లో దగ్గర దగ్గర 50 లక్షల మంది చూశారు. గత ఏడాది చివర్లో విడుదలైన మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ‘మాస్టర్‌ పీస్‌’ టీజర్‌ కూడా 24 గంటల్లో ఇన్ని వ్యూస్‌ దక్కించుకోలేదు. ఆ మాటకొస్తే మలయాళ టీజర్స్‌కి.. అది ఎంత పెద్ద స్టార్‌ది అయినా పది లక్షలు వ్యూస్‌ దక్కితే అది ఎక్కువ. అలాంటిది ఐదింతలు దక్కించుకుంది ‘ఒరు అడార్‌ లవ్‌’. కన్ను కొట్టుడా? మజాకానా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement