ప్రియాంకకు దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డు!
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు అరుదైన గౌరవం దక్కుతోంది. హాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టి అక్కడ క్వాంటికో సిరీస్ చేయడంతో పాటు బేవాచ్ సినిమా కూడా చేసిన ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డును త్వరలో ఇవ్వనున్నారు. 'అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటి' విభాగంలో ఆమెకు ఈ అవార్డు ఇవ్వాలని జ్యూరీ నిర్ణయించింది. ఈ విభాగాన్ని ఈ సారే కొత్తగా ప్రవేశపెడుతున్నారు. గతంలో స్పోర్ట్స్ డ్రామా 'మేరీకోమ్' బయోపిక్‌లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రియాంక.. అంతర్జాతీయంగా కూడా తన నటనకు మంచి మార్కులే కొట్టేసింది. ఇప్పుడు ఈ అవార్డు పొందుతున్న మొదటి మహిళగా ప్రియాంక నిలవబోతోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా ఆమె స్వయంగా నిర్ధారించాల్సి ఉంది. ట్విట్టర్‌లో కూడా ప్రియాంక దీని గురించి ఏమీ వ్యాఖ్యానించలేదు. జూన్ ఒకటో తేదీన ఈ అవార్డు బహూకరణ కార్యక్రమం జరగనుంది.
అంతేకాదు.. ప్రియాంక తల్లి మధు చోప్రాకు కూడా ఒక అవార్డు రాబోతోంది. తొలిసారి ఆమె నిర్మాతగా వ్యవహరించి తీసిన 'వెంటిలేటర్' సినిమాకు గాను ఉత్తమ తొలి చిత్రం అవార్డుకు ఆమె ఎంపికయ్యారు.
హీరో సిద్దార్థ మండిపాటు
అయితే ఈ అవార్డు విషయంలో ఒక వర్గం జాతీయ మీడియా వ్యవహరించిన తీరుపై హీరో సిద్దార్థ తీవ్రంగా మండిపడ్డాడు. శీర్షికలో 'అకాడమీ' అనే పేరును తీసేసి కేవలం దాదాసాహెబ్ ఫాల్కే అని మాత్రమే పెట్టడం పట్ల అతడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది చాలా బాధ్యతారహితమైన జర్నలిజం అన్నాడు.
The word academy has been swallowed in the headline. Click bait. Irresponsible journalism. pic.twitter.com/gb46N93GJn
— Siddharth (@Actor_Siddharth) 29 May 2017