వన్... టూ... త్రీ... రెడీ స్టార్ట్!
ప్రియాంకా చోప్రా మంచి జోరు మీద ఉన్నారు. అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’తో విదేశాల్లోనూ పాపులర్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు ‘బేవాచ్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇందులో ఆమె నెగటివ్ రోల్ చేయనున్నారు. ఒకవైపు హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్నప్పటికీ నిర్మాతగా ఏకంగా మూడు సినిమాలు ప్రకటించేశారు. ఆ చిత్రాల వివరాలు తెలుసుకుందాం...
♦ ‘పర్పల్ పెబెల్ పిక్చర్స్’పై ప్రియాంకా చోప్రా వరుసగా సినిమాలు తీయాలనుకుంటున్నారు. ఒక్క భాషకే ఈ సంస్థను పరిమితం చేయాలనుకోవడంలేదామె. స్టార్స్‌తో పాటు నూతన నటీనటులతో కూడా సినిమాలు తీయాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి భోజ్‌పురి, పంజాబీ, మరాఠీ భాషల్లో ఒక్కో చిత్రం నిర్మించనున్నారు.
♦ ‘భమ్ భమ్ బోలో రహా హై కాశీ’ పేరుతో భోజ్‌పురి చిత్రం రూపొందనుంది. భోజ్‌పురి సూపర్ స్టార్ నిరాహౌ, ఆమ్రపాలి దూబే జంటగా ఈ చిత్రం రూపొందనుంది. ఓ క్లాసిక్ లవ్‌స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ నెలలోనే చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.
♦ హిందీ చిత్రం ‘ఫెరారీ కీ సవారీ’ దర్శకుడు రాజేశ్ మపుస్కర్ దర్శకత్వంలో ‘వెంటిలేటర్’ పేరుతో ఓ మరాఠీ చిత్రం నిర్మించనున్నారు. ఇందులో మరాఠీ పరిశ్రమకు చెందిన పలువురు సీనియర్ తారలతో పాటు కొత్త నటీనటులు, రంగస్థల కళాకారులు కూడా నటించనున్నారు. ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించి, వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
♦ ‘ఏక్ ఓంకార్’ పేరుతో ఓ పంజాబీ చిత్రాన్ని నిర్మించనున్నారు. పంజాబీ పరిశ్రమకు చెందిన ఓ సూపర్ స్టార్‌తో ఈ చిత్రం తీయాలనుకుంటు న్నారు. అంబర్దీప్ సింగ్ రాసిన కథతో ఈ చిత్రానికి కరణ్ గులియాని దర్శకత్వం వహించనున్నారు. తన మూలాలను వెతుక్కుంటూ ఇండియా వచ్చే ఓ ఎన్నారై కుర్రాడి కథతో ఈ చిత్రం సాగుతుంది. మార్చిలో చిత్రీకరణ ఆరంభించి, గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
♦ ఇలా ఒకేసారి మూడు చిత్రాలు ప్రకటించారంటే ప్రియాంక ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారో ఊహించుకోవచ్చు. ఇంకా యాడ్ ఫిలింస్, టీవీ సీరియల్స్ కూడా తీయాలనుకుంటున్నారు ప్రియాంక.