పూరి కొత్త సినిమా 'హే భగవాన్'..!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టేస్తాడు. ఇటీవల వరుస ఫ్లాప్లతో కెరీర్ ఇబ్బందుల్లో పడ్డా, పూరిలో స్పీడు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే రోగ్ సినిమాను రిలీజ్కు రెడీ చేసిన పూరి.. బాలకృష్ణ హీరోగా మరో సినిమా షూటింగ్ ప్రారంభించాడు. ఇప్పటికే బాలయ్యతో చేస్తున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన పూరి, ప్రస్తుతం రోగ్ సినిమా ప్రమోషన్ల మీద దృష్టి పెట్టాడు.
ఇషాన్ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న రోగ్, ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన పూరి, తన తదుపరి ప్రాజెక్ట్ విశేషాలను వెల్లడించాడు. బాలయ్య సినిమా తరువాత హే భగవాన్ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టుగా తెలిపాడు పూరి. దేవుళ్ల కారణంగా ఈ ప్రపంచానికి ఎలాంటి కష్టాలు వస్తున్నాయో ఆ సినిమాలో చూపిస్తానంటున్నాడు. ఇప్పటికే ఇలాంటి వివాదాస్పద అంశాలను ఎంచుకొని చాలా మంది దర్శకులు ఇబ్బంది పడ్డారు. మరి పూరి ఈ సెన్సిటివ్ సబ్జెక్ట్ను ఎలా డీల్ చేస్తాడో చూడాలి.