ఇరాన్‌లో రెహమాన్ హవా!
ఏఆర్ రెహమాన్ పేరు ఇప్పుడు ఇరాన్‌లో మార్మోగిపోతోంది. ఇటీవలే ఆయన ఓ ఇరాన్ చిత్రానికి స్వరకర్తగా వ్యవహరించారు. మజిద్ మజిది దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా పేరు ‘మహమ్మద్-ద మెసెంజర్ ఆఫ్ గాడ్’. ఇరాన్ సినీ చరిత్రలోనే తొలిసారిగా అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఓ భారతీయ స్వరకర్త పాటలందించడం ఇదే మొదటిసారి. ఈ చిత్రం గత నెల 26న విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. ‘‘ఇస్లామ్ మత వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్త జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మతంలోని సారాన్ని, ఆత్మను తెర మీద ఆవిష్కరించింది. సుమారు 200 మంది సంగీత కళాకారులతో ఇరాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఈజిప్ట్, ఇండియా దేశాల్లో రికార్డింగ్ చేశాం. మిక్సింగ్ ఇక్కడే చెన్నైలో జరిగింది. నేను చేసిన రిస్కీ ఎటంప్ట్‌లో ఇదొకటి . కొన్ని సంఘ వ్యతిరేక శక్తుల వల్ల ఇస్లాం మతం మీద చాలా మందికి దురభిప్రాయాలు ఏర్పడ్డాయి. శాంతి, మానవత్వం పరిమళించిన మతం ఇస్లాం అని చెప్పడమే దర్శకుని అభిమతం. దాన్ని చాలా బాగా చూపించారు’’ అని ఏఆర్ రెహమాన్ చెప్పారు.