
'కబాలి' పేరుకాదు.. ఓ బ్రాండ్
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కబాలి మేనియా కనిపిస్తోంది. గతంలో ఏ భారతీయ సినిమాకు జరగని స్థాయి ప్రచారం ఈ సినిమా కోసం జరుగుతోంది. పలు అంతర్జాతీయ స్థాయి సంస్థలు కబాలి సినిమా ప్రమోషన్లో భాగం పంచుకుంటున్నాయి. హాలీవుడ్ స్థాయిలో ఏకంగా విమానాలపై కబాలి పోస్టర్లను ముంద్రించటంతో రజనీ మేనియా ఏ స్థాయిలో ఉందో తెలిస్తోంది. ఇప్పటికే ఎయిర్ ఏసియాతో పాటు ఎయిర్టెల్, ముత్తూట్ లాంటి సంస్థలు ప్రచారంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. వీటికి తోడు కబాలి పోస్టర్లతో తయారు చేసిన కీచైన్లు, టీషర్లు తమిళ నాట హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
వంద కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కబాలి, ఇప్పటికే 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తొలి వారంలోనే సంచలనాలు నమోదు చేస్తుందని భావిస్తున్న ఈ సినిమా, టోటల్ రన్లో 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తుందని నమ్ముతున్నారు. తొలిసారిగా మలేషియా అభిమానుల కోసం మలయ్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు ఇండియన్ సినిమా రిలీజ్ కాని చాలా దేశాల్లో కబాలి బోణి చేయడానికి రెడీ అవుతుంది. ఓవర్ సీస్ మార్కెట్ మీద భారీ ఆశలు పెట్టుకున్న చిత్రయూనిట్, ఒక్క అమెరికాలోనే 400 వందల థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. మొత్తంగా 5000ల స్క్రీన్స్ లో కబాలిని ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంతటి భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న కబాలి.. అభిమానుల ఆశలు నిజం చేస్తుందో లేదో చూడాలి.