‘నిజమైన రివ్యూలు ప్రేక్షకులకు తెలుసు’ | Rajinikanth comments on Mahesh Babu movie spider | Sakshi
Sakshi News home page

‘నిజమైన రివ్యూలు ప్రేక్షకులకు తెలుసు’

Published Fri, Sep 29 2017 12:22 AM | Last Updated on Fri, Sep 29 2017 8:52 AM

Rajinikanth comments on Mahesh Babu movie spider

‘‘మహేశ్‌లాంటి సూపర్‌స్టార్‌తో రెగ్యులర్‌ ఫార్మాట్‌ సినిమా తీయాలనుకోలేదు. కొత్త కాన్సెప్ట్‌తో సినిమా తీశాం. డిఫరెంట్‌ సినిమాలు వచ్చినప్పుడే ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది. నిజమైన రివ్యూలు ప్రేక్షకులకు తెలుసు’’ అన్నారు మురుగదాస్‌. మహేశ్‌బాబు హీరోగా ఆయన దర్వకత్వంలో ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్‌ నిర్మించిన ‘స్పైడర్‌’ బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. ‘‘మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 51 కోట్లు వసూలు చేసింది’’ అని ‘ఠాగూర్‌’ మధు చెప్పారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందన్న మురుగదాస్‌ చెప్పిన విశేషాలు..

► రెండు, మూడు సినిమాలు హిట్‌ అయితే చాలు.. ‘ఈ డైలాగ్‌ మార్చండి, ఆ ఆర్టిస్టు వద్దు’ అని కొందరు హీరోలు ఆంక్షలు పెడతారు. కానీ, మహేశ్‌లాంటి సూపర్‌స్టార్‌ అలాంటి కండీషన్స్‌ పెట్టలేదు.

► కథకు అనుగుణంగానే మహేశ్‌ క్యారెక్టర్‌ డిజైన్‌ చేయడం జరిగింది. విలన్‌ క్యారెక్టర్‌ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే హీరో క్యారెక్టర్‌ బలం తెలుస్తుంది. ఏ హీరో కూడా  ఇంకో యాక్టర్‌కి (ఎస్‌.జె సూర్య)కి అంత స్క్రీన్‌ స్పేస్‌ ఇవ్వడానికి ఒప్పుకోరు. అయితే స్క్రిప్ట్‌ని దృష్టిలో పెట్టుకుని మహేశ్‌ ఇచ్చారు. అందుకే మహేశ్‌ రియల్‌ హీరో. బాలీవుడ్‌ నుంచి కొందరు సినీ విశ్లేషకులు సినిమా బాగుందంటూ ఫోన్‌ చేశారు.

► హీరో పదిమంది విలన్స్‌ను కొడితే వాళ్లు గాల్లోకి లేచిపడటం, స్కిన్‌షో, రెగ్యులర్‌ సాంగ్స్‌తో సినిమాను తీయాలనుకోలేదు. అలాంటి సబ్జెక్ట్‌ను మహేశ్‌లాంటి సూపర్‌స్టార్‌తో డీల్‌ చేయాలనుకోలేదు. హీరోకు, విలన్‌కు స్ట్రాంగ్‌ వార్‌ జరుగుతున్నప్పుడు హీరోయిన్‌ పాత్రకు పెద్దగా స్పేస్‌ ఉండకపోవచ్చు. రకుల్‌ పాత్ర నిడివి తక్కువే అయి నప్పటికీ తనది కీ–రోల్‌. అద్భుతంగా నటించింది.

► డిఫరెంట్‌గా ట్రై చేద్దామనుకున్నాం. డిఫరెంట్‌ మూవీస్‌ను ప్రోత్సహించకపోతే ‘దంగల్, పీకే, భజరంగీ భాయిజాన్‌’ వంటి భిన్నమైన కాన్సెప్ట్‌ మూవీస్‌ వచ్చి ఉండేవి కాదు.

► తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. బీ,సీ సెంటర్లవారు కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘శ్రీమంతుడు’కంటే ‘స్పైడర్‌’కు తమిళనాడులో మంచి స్పందన వస్తోందని రిపోర్ట్స్‌ వస్తున్నాయి .

మంచి ప్రయత్నం: రజనీకాంత్‌
‘స్పైడర్‌’ చిత్రాన్ని  వీక్షించిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చిత్రబృందాన్ని అభినందించారు. ఇదొక మంచి ప్రయత్నం అని కొనియాడారు. ‘‘మంచి మెసేజ్‌తో సినిమా చాలా బాగుంది. మురుగదాస్‌ ఈ సబ్జెక్ట్‌ని అద్భుతంగా హ్యాండిల్‌ చేశారు. మహేశ్‌ అత్యద్భుతంగా నటించాడు. ఒక స్టార్‌ హీరో అయ్యుండి విలన్‌కు ఇంపార్టెన్స్‌ ఉన్న కథను ఒప్పుకోవడం మహేశ్‌ గొప్పతనం’’ అని రజనీకాంత్‌ అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement