సూపర్ స్టార్ కుమార్తె కారుకు ప్రమాదం
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు సౌందర్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం చెన్నైలోని అల్వార్‌పేట్ ప్రాంతంలో ఆమె కారు ఓ ఆటో రిక్షాను ఢీకొట్టింది. ఈ ఘటనలో సౌందర్యకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా ఆటో డ్రైవర్ గాయపడ్డాడు.
ఆటో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం కాగా సౌందర్య భావ, హీరో ధనుష్ జోక్యంతో విరమించుకున్నట్టు సమాచారం. ప్రమాద వార్త తెలియగానే ధనుష్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. వైద్యానికయ్యే ఖర్చులు భరిస్తామని, పరిహారం ఇస్తామని, కేసు లేకుండా రాజీ చేసుకుందామని చెప్పి ధనుష్.. ఆటో డ్రైవర్‌ను ఒప్పించాడు. సౌందర్యపై కేసు నమోదు కాకుండా కాపాడాడు. ప్రమాదం జరిగిన సమయంలో సౌందర్య కారును స్వయంగా నడిపారా లేక డ్రైవర్ ఉన్నాడా అన్న విషయం తెలియరాలేదు. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ధనుష్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రజనీ రెండో కుమార్తె సౌందర్య ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమాలో ధనుష్, కాజోల్, అమలాపాల్ తదితరులు నటిస్తున్నారు.