'లింగా' నష్టాలకు రజనీకాంత్ బాధ్యుడు కాదు
చెన్నై: 'లింగా' సినిమా నష్టాలు రావడానికి రజనీకాంత్ బాధ్యత కాదని తమిళ చిత్ర నిర్మాతల మండలి స్పష్టం చేసింది. లింగా చిత్రం డిస్ట్రిబ్యూటర్లు రజనీకాంత్ ఇంటిముందు భిక్షాటన చేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించడం సరికాదని పేర్కొంది. డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయాన్ని నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది.
'రజనీకాంత్ సినిమాలు చాలా వరకు భారీ విజయం సాధించాయి. రజనీతో సినిమాలు తీసినవారు భారీ లాభాలను పొందారు. లింగా సినిమా పరాజయం కావడానికి రజనీకాంత్ కారణం కాదు. నష్టాలకు ఆయనను బాధ్యుణ్ని చేయడం సరికాదు. పరిహారం కోసం డిస్ట్రిబ్యూటర్లు భిక్షాటన చేయాలని నిర్ణయించడాన్ని ఖండిస్తున్నాం' అని నిర్మాతల మండలి ఓ ప్రకటనలో తెలిపింది.
రజనీకాంత్ నటించిన లింగా చిత్రం పరాజయం కావడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. భారీ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు పరిహారం డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్మాత రాక్లైన్ వెంకటేశ్, డిస్ట్రిబ్యూటర్ల మధ్య పరిష్కారం కుదరలేదు. దీంతో పరిహారం కోసం రజనీకాంత్ ఇంటి నుంచి భిక్షాటన చేసి ఆందోళన నిర్వహించాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారు.