కోర్టుకు ‘లింగా’
చెన్నై : లింగా వ్యవహారం ఆరోపణలు ఆందోళనలు దాటి కోర్టు గుమ్మం తొక్కింది. హత్యా చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని... ఈ నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆళ్వాతిరునగర్‌కు చెందిన ఆర్ సింగారవడివేలన్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ తాను రజినీకాంత్ నటించిన లింగా చిత్ర తిరుచ్చి, తంజావూర్ ఏరియాల విడుదల హక్కుల్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు.
లింగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్రం విజయం సాధించడం ఖాయం అని అలాకాని పక్షంలో నష్టం వాటిల్లిన బయ్యర్లకు పరిహారం చెల్లిస్తానని రజనీకాంత్ అన్నారని పేర్కొన్నారు. ఆయన మాటలు నమ్మి తాను రూ.7.13 కోట్లకు లింగా చిత్రాన్ని కొన్నానన్నారు. అయితే లింగా చిత్రం విడుదలై ఆశించిన విజయం సాధించకపోవడంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారని పేర్కోన్నారు. దీంతో మరో వైపు నష్టపోయిన థియేటర్ల యాజమాన్యం పరిహారం చెల్లించాలంటూ డిస్ట్రిబ్యూటర్లను అడుగుతున్నారని వివరించారు. దాంతో ఆందోళనలు, నిరాహార దీక్షలు చేసి నిర్మాత, చిత్ర హీరోలపై ఒత్తిడి తీసుకురాగా చివరికి రజినీకాంత్ నష్టపరిహారంగా రూ.12.5 కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చారని తెలిపారు.
అయితే అందులో ఆరుకోట్లు మాత్రమే చెల్లించారని మిగిలింది అడిగితే కోర్టులో ఉన్న కేసును వాపస్ తీసుకున్న తరువాత ఇస్తామన్నారని అన్నారన్నారు. వారి మాట ప్రకారం కోర్టులో కేసును వాపస్ తీసుకున్నామని... అయినా మిగిలిన రూ. ఆరు కోట్లు చెల్లించకుండా మోసం చేశారని ఆరోపించారు. అంతే కాకుండా రజినీకాంత్ రెచ్చగొట్టడంతో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి థాను ఇతర నిర్మాతలందరకీ లేఖలు రాసి తనతో సంప్రదించిన తరువాతే సింగర వడివేలన్‌కు చిత్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇవ్వాలని చెబుతున్నారని పేర్కొన్నారు.
కొంతమంది వాట్స్‌యాప్‌లో హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ విషయమై గత 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు చర్యలు చేపట్టలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు బుధవారం న్యాయమూర్తి పీఎన్ ప్రకాష్ సమక్షంలో విచారణకు వచ్చింది. పిటీషనర్ తరపున జి విజయకుమార్, ఎం సతీష్‌కుమార్ హాజరై వాదించారు. ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది రెండు వారాల పాటు కేసును వాయిదా వేయాలని కోరారు. న్యాయమూర్తి రెండు వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.