రజనీ కోసం తిరుపతికి అభిమానుల పాదయాత్ర!
సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారనే సంగతి ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. ఏప్రిల్ 11 తేదిన రజనీ నటించిన 'కొచ్చడయాన్' చిత్రం విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో అభిమానులు పాదయాత్ర చేపట్టారు. కొచ్చడయాన్ చిత్రం ఘన విజయం సాధించాలని ఏప్రిల్ 2 తేదిన వెల్లూరు నుంచి తిరుపతికి పాదయాత్ర చేపట్టనున్నారు.
నెల్లూరు కు చెందిన రజనీకాంత్ ఫ్యాన్ క్లబ్ ట్రెజరర్ ఎన్ రవి పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. వందలాది రజనీ ఫ్యాన్స్ ఏప్రిల్ 2 తేదిన పాదయాత్రగా తిరుపతి బయలు దేరుతున్నాం. రెండేళ్ల తర్వాత కొచ్చడయాన్ చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలి. అంతేకాకుండా రజనీకాంత్ ఆరోగ్యం బాగుండాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తాం అని రవి తెలిపారు.
భారత దేశపు తొలి ఫోటో రియలిస్టిక్ 3D యానిమేషన్ చిత్రంగా 'కొచ్చడయాన్'ను సౌందర్య రజనీకాంత్ రూపొందించారు. దీపికా పదుకొనే, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, నాజర్, ఆది పినిశెట్టి నటించిన ఈ చిత్రం ఆరు భాషల్లో విడుదలకు సిద్దమవుతోంది.