
మైండ్ గేమ్
ఐపీయస్ ట్రైనింగ్ పూర్తికాక ముందే ఆ కుర్రాడు డ్యూటీ స్టార్ట్ చేస్తాడు. సీక్రెట్‌గా శత్రువుకి చుక్కలు చూపిస్తాడు. తనకు చెక్ పెడుతున్నది ఎవరో శత్రువుకి తెలియడంతో ఆ కుర్రాడితో మైండ్ గేమ్ ఆడాలనుకుంటాడు. అప్పుడు ట్రైనీ ఐపీయస్ ఏం చేశాడు? రివర్స్‌లో ఎలాంటి మైండ్ గేమ్ ఆడాడు? అనే కథతో తెరకెక్కుతోన్న సినిమా ‘ధృవ’. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను విజయదశమి కానుకగా సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నారు.
గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. తమిళ హిట్ సినిమా ‘తని ఒరువన్’కి రీమేక్ ఇది. ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించడం కోసం కండలు పెంచారు. మీసకట్టు స్టైల్ మార్చారు. కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం చివరి పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. విలన్‌గా అరవింద్ స్వామి, హీరో స్నేహితుడిగా నవదీప్ నటిస్తున్నారు.